Begin typing your search above and press return to search.

రుణ ఉచ్చులో ప్రపంచం.. కరెన్సీలు విలువ కోల్పోతాయి.. రాబోయే రోజులు కఠినం

ఈ ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ పొందాలంటే సంప్రదాయ కరెన్సీలపై ఆధారపడకుండా బంగారం, వెండి, బిట్ కాయిన్ లాంటి అసెట్స్ పై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు.

By:  A.N.Kumar   |   17 Dec 2025 6:00 PM IST
రుణ ఉచ్చులో ప్రపంచం.. కరెన్సీలు విలువ కోల్పోతాయి.. రాబోయే రోజులు కఠినం
X

ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి గ్లోబల్ ఎకానమీపై తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు. రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండబోతున్నాయని.. ప్రపంచం మొత్తం ఒక ‘డెట్ ట్రాప్ (రుణ ఉచ్చు)లో చిక్కుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు, బ్యాంకులు, పెద్ద సంస్థలు అన్నీ అప్పుల మీదే నడుస్తాయని.. ఈ పరిస్థితి ఎప్పటికైనా పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.

ప్రమాదంలో ఫియట్ కరెన్సీల భవిష్యత్తు

డాలర్, రూపాయి లాంటి ప్రభుత్వాలు నిర్వహించే కరెన్సీలు (ఫియట్ కరెన్సీలు) క్రమంగా తమ విలువను కోల్పోతాయని కియోసాకి హెచ్చరించారు. ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బు ముద్రించడం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (ఇన్ ప్లేషన్) వల్ల సాధారణ ప్రజల పొదుపు శక్తి తగ్గిపోతుందన్నారు. నేడు బ్యాంకులో ఉన్న డబ్బుకు విలువ ఉన్నట్టు కనిపించినా.. భవిష్యత్తులో అదే డబ్బు కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు.

బంగారం, వెండి, బిట్ కాయిన్ పైనే ఆశలు

ఈ ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ పొందాలంటే సంప్రదాయ కరెన్సీలపై ఆధారపడకుండా బంగారం, వెండి, బిట్ కాయిన్ లాంటి అసెట్స్ పై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. చరిత్ర చూస్తే సంక్షోభ కాలాల్లో బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు తమ విలువను నిలుపుకున్నాయని.. అలాగే ఆధునిక కాలంలో బిట్ కాయిన్ డిజిటల్ గోల్డ్ గా మారుతోందని ఆయన అభిప్రాయం.

ఫైనాన్షియల్ నాలెడ్జ్ అసలైన ఆయుధం

అయితే కేవలం ఆస్తులు కొనడం సరిపోదని.. ప్రతీ వ్యక్తి తన ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా కీలకమని కియోసాకి స్పష్టం చేశారు. ఆదాయం ఎలా వస్తుంది? ఖర్చులు ఎలా నియంత్రించాలి.? పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి? అనే విషయాలపై అవగాహన లేకపోతే కఠిన కాలాల్లో నిలబడడం కష్టమన్నారు. ‘స్కూల్స్ మనకు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పవు. మనమే నేర్చుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

ముందస్తు సిద్ధతే భద్రత

రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని కియోసాకి చెబుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఆలోచించి అప్పులపై ఆధారపడకుండా పొదుపు-పెట్టుబడుల మధ్య సమతుల్యత సాధిస్తూ ముందుకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. కఠిన సమయాల్లో నిలబడాలంటే భయం కాదు.. సిద్ధతే నిజమైన భద్రత అన్నదే ఆయన సందేశం.