నగరిలో రోజా రాజకీయం చేసేనా .. ?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా, మునుపెన్నడూ లేని గడ్డు స్థితిలో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
By: Garuda Media | 28 Oct 2026 5:00 AM ISTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా, మునుపెన్నడూ లేని గడ్డు స్థితిలో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా రెండు సా ర్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, వైసీపీ హయాంలో మంత్రి అయిన రోజా.. ఇక తనకు తిరుగులేదని అనుకున్నారు. కానీ, గత ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత.. కేసుల భయంతో ఆమె సైలెంట్ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో రోజాకు మరింత ఎక్కువగా సెగ తగిలింది.
2024 శాసనసభ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆర్కే రోజా, టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో 45,004 ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ నుంచి దాఖలైన నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురికావడం, టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం రోజాకు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. ఈ ఏకగ్రీవాలపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే.. అప్పటికే అంతా అయిపోవడంతో చేతులు ఎత్తేసే పరిస్థితి నెలకొంది.
నగరి నియోజక వర్గంలో స్థానిక వైసీపీ నేతలతో రోజాకు పొసగక పోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆమె ఏకపక్ష వైఖరి వల్ల పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా మద్దతు తెలుపుతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నియోజకవర్గంలో బలమైన పట్టు సాధిస్తూ, ప్రభుత్వం తరుఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, రోజా రాజకీయ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
నగరి మునిసిపాలిటీలో టీడీపీ దూకుడు ప్రదర్శించిందనే చెప్పాలి. 40 వార్డులు ఉన్న నగరి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇ.ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున దాఖలైన నామినేషన్లలో స్వీయ ధ్రువీకరణ తప్పుల కారణంగా వాటిని అధికారులు తిరస్కరించారు. దీంతో అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఫలితంగా రోజా తరఫున బరిలో ఉన్న నాయకులు వెనక్కి తగ్గారు. ఈ పరిణామాలతో రోజా రాజకీయాలు మరింత మైనస్ అయ్యాయని అంటున్నారు. దీనికి ఆమె స్వయంకృతమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
