రోజా అరెస్ట్ ఎపుడు......ఫైర్ బ్రాండ్ ఆన్సర్ ఇదే !
ఆర్కే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి, రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2024లో నగరిలో 45 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
By: Satya P | 10 May 2026 9:11 AM ISTఆర్కే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి, రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2024లో నగరిలో 45 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆమె అయిదేళ్ళ వైసీపీ పాలనలో టీడీపీ నేతల మీద ఎన్నో ఘాటు విమర్శలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. అయినా రోజా అరెస్ట్ కాలేదు. దాని వెనక సీక్రెట్ ఏమిటి అన్న దానికి సంబంధించి ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ లో క్రాస్ ఫైర్ లో రోజా తన అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ తప్పూ చేయలేదు :
తాను ఏ తప్పూ చేయలేదని రోజా చెప్పారు. తాను కనుక తప్పు చేస్తే రెండేళ్ళు కాదు ఎపుడో అరెస్టు చేసి ఉండేవారు అని అన్నారు. అసలు కూటమి అధికారంలోకి వచ్చాక వెంటనే తన లాంటి వారి విషయంలో ఏమైనా తప్పులు చేశామా అని ఫైల్స్ అన్నీ చెక్ చేసేసే ఉంటారని అన్నారు. కానీ ఎక్కడా తన మంత్రిత్వ శాఖలో తాను ఏ పొరపాటూ చేయలేదు కాబట్టే ఏమీ చేయలేకపోయారు అని అన్నారు. అంతే కాదు 2014 నుంచి 2019 మధ్య కాలంలో తనను అసెంబ్లీ నుంచి చంద్రబాబు అకారణంగా సస్పెండ్ చేయించారని ఎంతో వేదనకు గురి చేశారని దాని ఫలితంగా ఆయన అయిదేళ్ళ పాటు ఓటమి చెంది విపక్షంలోకి వచ్చారని అన్నారు. అకారణంగా మహిళల జోలికి వస్తే ఏమి జరుగుతుందో తెలుసు కాబట్టే తనను అరెస్ట్ చేయలేదని అనుకుంటున్నాను అన్నారు
తమిళ పాలిటిక్స్ లోకి :
తాను వైసీపీకి దూరంగా ఉంటున్నాను అని తమిళ పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను అన్నది పూర్తిగా అవాస్తవం అని రోజా అన్నారు. తాను రాజకీయాల్లో జయలలితను ఎంతగానో అభిమానిస్తాను అని ఆమె పిలిచినపుడే తమిళ రాజకీయాల్లో చేరలేదని గుర్తు చేశారు. తాను తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఇక్కడే పోటీ చేస్తాను అని తన సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను అని చెప్పారు. తనకు వైసీపీలో ఎవరితోనూ ఏ రకమైన గ్యాప్ లేదని అన్నారు. తాను ఏ విషయం అయినా నేరుగా జగన్ తో మాట్లాడగల స్వేచ్చ ఉందని అన్నారు. తన సొంత అన్నయ్యతో ఎలా మాట్లాడుతానో అంతలా జగన్ తో మాట్లాడే అవకాశం ఆయన ఇచ్చారు అని చెప్పారు.
ఈవీఎంల వల్లనే :
తాను తమ పార్టీ ఈవీఎంల వల్లనే ఓటమి చెందామని భావిస్తున్నామని రోజా అన్నారు. లేకపోతే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను చేసిన తాము ఓటమి చెందడం అంటే అంతకంటే ఆశ్చర్యం లేదని అన్నారు. ఇక ప్రజలు ఎవరూ తమని ఓడించారని భావించడం లేదని అన్నారు. ఈ రోజుకీ తాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తన వెంటనే ఉంటున్నారు అని రోజా చెప్పారు. తాము ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నామని అన్నారు. ఇక ఓటమి తరువాత మాత్రం రెండు నెలల పాటు బాధ కలిగి చెన్నైలో ఉన్నాను అని ఆమె చెప్పారు.
కౌంటర్లు మాత్రమే :
తాము కూటమి నేతలను ఎప్పుడు విమర్శించినా కౌంటర్లు మాత్రమే అని రోజా చెప్పారు. కోరి తాము వారి మీద నోరు పారేసుకున్నది లేదని అన్నారు. ఇక రెండేళ్ళుగా తాము ప్రతిపక్షంలో ఉన్నా ఈ రోజుకీ కూటమి నేతలు తమను విమర్శిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. వారికి అధికారం ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి తమ మీద విమర్శలు చేయడం దారుణం అన్నారు.
