Begin typing your search above and press return to search.

జగన్ కేసీఆర్ లను వెంటాడుతున్న శపధాలు !

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఒకే మాదిరిగా సాగుతోంది. విపక్ష నేతలు జగన్ కేసీఆర్ ఒద్దికగా ఉంటున్నారు. దోస్తీ కడుతున్నారు.

By:  Satya P   |   25 Dec 2025 4:00 AM IST
జగన్ కేసీఆర్ లను వెంటాడుతున్న శపధాలు !
X

రాజకీయాలు అంటే ఎన్నో పరీక్షలు సవాళ్ళతో కూడుకున్నవి. వాటిని తట్టుకుంటూ నెట్టుకుంటూ అందులో నెగ్గుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే ఒకప్పటిలా రాజకీయాలు ఈ రోజు లేవు. ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా జరిగి చాలా కాలమవుతోంది. మైండ్ గేమ్ పాలిటిక్స్ ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రత్యర్ధుల మైనస్ పాయింట్లు తరచూ బయటపెడుతూ వాటిని నెమ్మదిగా జనంలోకి పంపించడం ద్వారా వారిని ఎప్పటికీ అధికారంలోకి రానీయకూడదు అన్నది నయా వ్యూహంగా చలామణీ అవుతోంది. ఎన్నికల ముందు చెబితే అది ప్రచారం హోరులో కలసిపోతుంది. అందుకే ఎన్నికలు చాలా దూరంలో ఉండగానే ప్రత్యర్ధులు ఎందుకు అధికారంలోకి రాకూడదో జనాలకు వీలైనంతగా విడమరచి చెప్పే ప్రయత్నం సాగుతోంది. దీంతో పాటు భీకర శపధాలు కూడా చేస్తున్నారు.

వ్యక్తిగత ప్రతిష్టగా :

రాజకీయాలు అంటే ప్రజలతో ముడిపడి ఉన్నవి. అటూ ఇటూ డిబేట్లు సాగుతాయి. జనాలు ఎవరి వాదన సబబో వింటారు, అలా అన్నీ ఆలోచించి తనకు నచ్చిన వారికి ఓటేసి సీటు అప్పగిస్తారు. అయితే శపధాల రాజకీయాలలో వ్యక్తిగత ప్రతిష్ట అధికంగా ఉంటోంది. ఫలానా పార్టీని నాయకుడిని తాము ఎప్పటికీ అధికారంలోకి రానీయమని భీష్మ శపధాలే చేస్తున్నారు మేము ఉండగా వారు అధికారం వైపు చూడరంతే, ఇది మా మాట ఇదే మాత ప్రతిజ్ఞ. ఇదే మా ఆదేశం ఇలా నేతల మాటలు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు మరింత కాలం ఉండాలనుకోవడం సహజం. అదే సమయంలో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించేలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇవే ఇపుడు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి.

రెండు రోజుల తేడాలో :

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఒకే మాదిరిగా సాగుతోంది. విపక్ష నేతలు జగన్ కేసీఆర్ ఒద్దికగా ఉంటున్నారు. దోస్తీ కడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు కి గత టీడీపీ అనుబంధం ఉంది. ఈ ఇద్దరి మధ్యన అనుకూలత పాలు ఎంత అన్నది తేలకపోయినా వ్యతిరేకత అయితే పెద్దగా లేదని అంతా ఒప్పుకుంటారు. ఇక రెండు రోజుల తేడాలో ఏపీ తెలంగాణాలకు చెందిన కీలక నాయకులు ఇద్దరి భీకరమైన శపధాలే చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో క్యాడర్ తో మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీని శాశ్వతంగా అధికారానికి దూరం చేస్తామని చెప్పారు, అంతే కాదు ఎప్పటికీ ఆ పార్టీకి అధికారం దక్కదని అన్నారు. కరెక్ట్ గా రెండు రోజుల తేడాలో తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అంటున్నారు. ఆయన తాను అధికారంలో ఉండగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానీయమని గట్టిగానే శపధం చేశారు. ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే ఇలా ఉన్నాయి.

నేను ఉన్నంత కాలం :

తాను యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నంత కాలం కేసీఆర్ కానీ ఆ కుటుంబం కానీ అధికారం చేపట్టలేదని సీఎం రేవంత్‌ శపథం చేసారు. ఆయన నారాయణపేట్‌ లోని కోస్గిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ కీలక నేతలపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. 2028 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన జోస్యం చేప్పారు.

శపధాలతో దోస్తీ :

జగన్ కేసీఆర్ ఇద్దరూ ఈ భీకర శపధాలతో ఇపుడు సతమతమవుతున్నారు. ఆ మధ్యన ఒకసారి పవన్ ఇదే మాట అంటూ వైసీపీని అధికారంలోకి రాకుండా చేస్తామని చెప్పారు. దానికి ప్రెస్ మీట్ లో విలేకరి జగన్ ముందు ప్రస్తావిస్తే అధికారం ఇచ్చేది ఆయన కాదు కదా ప్రజలు ఇస్తారు, అలాగే పైన ఉన్న దేవుడు ఆశీర్వదిస్తారు అని తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు అదే అన్నారు. పవన్ అధికారం ఇవ్వను అనడానికి ఎవరు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కూడా అదే మాట అంటున్నారు. అయితే అధికారంలో ఉన్న వారి శపధాలు మాత్రం జనంలో చర్చగానే ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో అంతిమ ప్రభువులు ప్రజలే కాబట్టి వారి మెప్పు పొందేందుకు కేసీఆర్ కానీ జగన్ కానీ ఏమి చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.