పక్కనే ముప్పు.... మహా నగరాలకు డేంజర్ సిగ్నల్స్ !
మహా నగరాలకు ముప్పు ఎక్కడో లేదు పక్కనే ఉందని అంటున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో ఏర్పడిన నగరాలు ఎంతో అభివృద్ధిని సొంతం చేసుకున్నాయి.
By: Satya P | 2 Sept 2026 8:49 AM ISTమహా నగరాలకు ముప్పు ఎక్కడో లేదు పక్కనే ఉందని అంటున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో ఏర్పడిన నగరాలు ఎంతో అభివృద్ధిని సొంతం చేసుకున్నాయి. మెట్రో సిటీలుగా మారి ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. ప్రగతి దిశగా అవి వేగంగా అడుగులు వేస్తూ ఆయా దేశాలకు ఆర్ధికంగా చోదకశక్తిగా నిలుస్తున్నాయి. అయితే ఈ తీర ప్రాంత మహా నగరాలకు పెను ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అక్కడా ఇక్కడా కాదు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు రెడ్ జోన్ లోకి వెళ్ళబోతున్నాయని ఐక్య ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించడం విశేషం. దానికి కారణం పెరుగుతున్న సముద్ర మట్టాలు అని పేర్కొంటోంది.
భారత్ లో ఆ రెండు సిటీస్ :
ఇదిలా ఉంటే భారతదేశంలో రెండు మహా నగరాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. అవి దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై, అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా అని చెబుతున్నారు. ఈ రెండు మహా నగరాలు అర్జంటుగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరమైన పరిస్థితి చూస్తాయని కూడా ఐక్య రాజ్య సమితి హెచ్చరిస్తోంది. ఎగిసిపడుతున్న సముద్ర మట్టాలు ఈ నగరాలలోని నివాసాలను నీటిమట్టం చేయనున్నాయని అంటున్నారు. పైగా ఇవి లోతట్టు ప్రాంతంలో ఉన్నాయని చెబుతున్నారు. అంటే సముద్ర మట్టం కంటే దిగువన నగరాలు ఉన్నాయన్న మాట.
దక్షిణాసియాలో రెడ్ జోన్ :
ఇక దక్షిణాసియాలో చూస్తే రెడ్ జోన్ లోకి అనేక మహా నగరాలు వెళ్ళాయని అంటున్నారు. వాటిలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కూడా ఉంది. తీర ప్రాంత నగరాలలో సముద్ర మట్టం పెరగడం వల్ల ఏకంగా నగరాలకు నగరాలే ఇబ్బందిలో పడతాయని అంటున్నారు. దీని మీద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. సముద్ర మట్టాల పెరుగుదల వాటి వల్ల ఎదురవుతున్న సవాళ్లు అందుకు అవసరమైన పరిష్కారానికి మార్గాలు అంటూ డుదల చేసిన రిపోర్టులో షాకింగ్ విషయాలే ఉన్నాయి. ఇది ఎపుడో భవిష్యత్తులో వచ్చే ముప్పు కాదని ఇపుడే కళ్ల ముందే అనేక వినాశక పరిణామాలు కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
మొత్తం మునిగిపోవడమే :
ఈ పెను ముప్పులో ఒక్కోసారి తీర ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయని కూడా నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ద్వీప దేశాలు తీరప్రాంత నగరాలు ఇప్పటికే వరదలు భూమి కోతకు గురవుతున్నాయని నివేదికలో ప్రస్తావించారు. దీనికి ప్రధాన కారణం తీవ్రమైన వాతావరణ మార్పులుగా పేర్కొన్నారు. ఒక్కసారిగా సముద్ర మట్టాలు పెరగడం వల్ల తుఫానుల తీవ్రత పెరిగింది అని అంటున్నారు. అలాగే సముద్రపు ఉప్పెనలు జనవాసాల్లోకి దూసుకొస్తున్నాయి అని చెబుతున్నారు. అదే విధంగా ఉప్పు నీరు భూగర్భ జలాల్లోకి చేరడం వల్ల తీరప్రాంతాల్లో తాగునీరు సాగునీరు సంపూర్ణంగా కలుషితమవుతున్నాయి. ఉన్న చోట బతకలేక వలసలకు జనాలు పోవడంతో పాటు తమ నివాసాలు కోల్పోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ తోనే :
భూ తాపం కారణంగా మంచు పర్వతాలు సైతం పెద్ద ఎత్తున కరిగిపోవడం అలాగే సముద్రపు నీరు వేడెక్కి విస్తరించడం వల్ల ఈ సమస్య మరింత వేగంగా పెరుగుతోంది. దీనిని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ తక్షణమే కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నారు. తీవ్రమైన నష్టం కూడా దీని వల్ల వాటిల్లనుంది. రహదారులు, రవాణా వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, నీటి వనరులు, భవనాలు, భూగర్భ జలాలపై కూడా సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఉత్పన్నం అయ్యే పరిణామాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఇక్కడ పేద గొప్ప దేశం అన్నది లేదు, సముద్ర తీరంలో ఉండే నగరాలు ప్రాంతాలన్నింటికీ సమానంగా డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. అమెరికాలోని మియామి, న్యూయార్క్ అలాగే చైనాలో గ్వాంగ్‌జౌ వంటి సంపన్న నగరాలలో సైతం కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు సముద్ర మట్టాలు పెరిగిపోవడం వల్ల ముప్పు ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూసినపుడు తీర ప్రాంత పెను ముప్పు ఉన్న తీర ప్రాంత నగరాల వల్ల జరిగే నష్టం విలువ 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
పది శాతం ప్రపంచ జనాభా :
తీర ప్రాంతాలలో ముప్పుకు గురి అయ్యే జనాభా చూస్తే ప్రపంచ మొత్తం జనాభాలో పదవ వంతు అని అంటున్నారు. అంటే దాదాపుగా 80 కోట్లు అన్న మాట. వీరంతా సముద్ర మట్టాలకు అయిదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో తమ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే భూ తాపం వల్ల అంతకంతకు సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. గడచిన పదేళ్లలో చూస్తే ఈ పెరుగుదల గణనీయంగా ఉంది. 2014 నుంచి 2023 దాకా వివరాలు చూస్తే ఏడాదికి సగటున 4.7 మిల్లీమీటర్లుగా ఈ పెరుగుదల ఉంది. అయితే 2024లో ఒక్క ఏడాదిలోనే 5.9 మిలీ మీటర్ల పెరుగుదల ఉండడం కొత్త రికార్డుగా చెబుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే తగిన చర్యలకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాల్సి ఉంది.
