యుద్ధం ఏదైనా విజేత మాత్రం రష్యా !
రష్యా అగ్ర రాజ్యంగా ఉంది. 1990 నాటి సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయినా సరే రష్యా ఈ రోజుకీ ప్రబల శక్తిగా ఉంది.
By: Satya P | 11 March 2026 9:11 AM ISTరష్యా అగ్ర రాజ్యంగా ఉంది. 1990 నాటి సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయినా సరే రష్యా ఈ రోజుకీ ప్రబల శక్తిగా ఉంది. అగ్ర రాజ్యం అమెరికాను ఢీ కొట్టే స్థాయిలోనే ఉంది. అలా తన ప్రాబల్యాన్ని రష్యా నిలుపుకుంటూ వస్తోంది. నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ తో రష్యా జరుపుతున్న యుద్ధమే తీసుకుంటే యూరోపియన్ దేశాలు అన్నీ ఏకమైనా అగ్ర రాజ్యం కన్నెర్ర చేసినా వెనక్కి తగ్గింది లేదు, అయితే రష్యాని ఆ దేశాలన్నీ ఆంక్షలతో ఇరుకున పెట్టాయి. రష్యా ఇంధనం మీద కండిషన్లు పెట్టి ఆర్ధికంగా దెబ్బ కొట్టాలని చూశాయి. దాంతో రష్యా పాక్షికంగా ఇబ్బందులు పడింది. కానీ ఇపుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా జెండా మళ్లీ ఘనంగా ఎగురుతోంది.
ఒప్పుకున్న ఈయూ :
అవును నిజమే రష్యావే విజేత అని యూరోపియన్ దేశాలే ఒప్పుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో కోస్టా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ జరిగిన యుద్ధంలో విజేత ఎవరైనా ఉంటే అది రష్యా మాత్రమే అని ఆయన అనడం విశేషం. ఈ యుద్ధం పుణ్యమాని ఒక్కసారిగా చమురు ధరలు పెరిగాయని అది రష్యాకే అనుకూలించే పరిణామంగా మారిందని ఆయన అన్నారు.
ఆర్థికంగా బలోపేతం :
ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన మార్కెట్ ఇపుడు సంక్షోభంలో ఉంది ఇవన్నీ రష్యా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి విశేషంగా దోహదపడుతున్నాయని ఆయన ఈయూ రాయబారుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఇపుడు ప్రపంచం దృష్టి అలాగే అనేక దేశాల ఫోకస్ అంతా పశ్చిమాసియా యుద్ధం మీదనే ఉందని దాంతో రష్యా మీద ఆటోమేటిక్ గా ఒత్తిడి తగ్గిపోయింది అని ఆయన అన్నారు. పశ్చిమ దేశాలు అన్నీ తమ ఆయుధాలను పశ్చిమాసియా యుద్ధం వైపుగా మళ్ళించాల్సి రావడంతో ఉక్రెయిన్ కి ఈ దేశాలు చేసే ఆయుధ సాయం కూడా తగ్గిపోతుంది అని ఆయన అన్నారు. ఈ విధంగా కూడా రష్యా లాభపడుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా మీద విమర్శలు :
మరో వైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా అమెరికా మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టాలని అన్నింటినీ అమెరికా కాలదన్నుతోందని విమర్శించారు. దాంతో ఈ విషయం మీద పశ్చిమాసియా దేశాలు అన్నీ ఒక్క త్రాటిపైన నిలిచి అంతర్జాతీయ చట్టాలని కాపాడాల్సిన అవసరం ఉందని ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. కేవలం యుద్ధాల ద్వారా బాంబుల ద్వారా స్వెచ్చను అలాగే మానవ హక్కులను ఎవరూ సాధించలేరని ఆయన అమెరికా తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలని పకడ్బంధీగా అమలు చేయడం ద్వారానే ఇవన్నీ సాధ్యమని అభిప్రాయపడ్డారు.
అన్ని దేశాలకు పెను ముప్పులా :
ప్రస్తుత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరింతగా ఈ పరిణామాలు పెచ్చరిల్లకుండా అంతా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే పశ్చిమాసియాతోనే ఈ చిచ్చు ఆగదని యూరప్ తో పాటు అన్ని దేశాలకు పెను ముప్పులా దాపురిస్తుందని ఆంటోనియో కోస్టా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. మొత్తం మీద నిన్నటిదాకా పశ్చిమ దేశాలు రష్యాని చేసిన కట్టడి సడలిపోగా ఇపుడు అమెరికా తీరు మీదనే అవి గుర్రుగా ఉండడం కూడా రష్యా సాధించిన మరో విజయంగా అంతా చూస్తున్నారు.
