కోతుల బెడద తప్పడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి!
అయితే ఇప్పుడు మాత్రం కోతుల బెడద ఏ విధంగా ఉందో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాము.. ఒకప్పుడు కోతులు అంటే ఎక్కువగా గుళ్ళు, గ్రామాలకు దూరంగా అడవుల్లో కనిపించేవి.
By: Madhu Reddy | 3 Jan 2026 6:41 PM ISTఊరు వాడ అని తేడా లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కోతుల బెడద ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆధునిక ప్రపంచంలో పెరిగిపోతున్న టెక్నాలజీ.. మరొకవైపు అభివృద్ధి కోసం అడవులను నరికి వేస్తూ.. మూగ జంతువులకు ఆవాసం లేకుండా చేస్తున్నారు.అందుకే తినడానికి తిండి లేక.. ఉండడానికి ఆవాసం లేక మూగ జంతువులన్నీ జనావాసాల్లోకి వస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
అప్పుడప్పుడు మనం న్యూస్ లో వింటూనే ఉంటాం పులులు, సింహాలతో పాటు ఇతర మూగ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు మాత్రం కోతుల బెడద ఏ విధంగా ఉందో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాము.. ఒకప్పుడు కోతులు అంటే ఎక్కువగా గుళ్ళు, గ్రామాలకు దూరంగా అడవుల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నాయి.. ఆకలితో అలమటించలేక జనావాసాల్లోకి వస్తూ ప్రజలకు మరింత ఇబ్బందులను కలగజేస్తున్నాయి.
గ్రామాలు , పట్టణాలలో గుంపులు గుంపులుగా చేరి అటు ప్రజలకు ఇటు పంటలకు ఇళ్ళకి కూడా నష్టం కలిగిస్తున్నాయి. నిత్యావసరాలను ఎత్తుకెళ్లడం.. ఇళ్లల్లోకి చొరబడడం, ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, పిల్లలపై దాడులు చేయడం, భయపెట్టడం లాంటి అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. దీని నివారణకు గ్రామస్తులు, అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు .
ఇటీవల తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగే సమయంలో కూడా తమ గ్రామాలలో కోతుల బెడద లేకుండా చేస్తే గెలిపిస్తామని ప్రజలు డిమాండ్ చేయగా.. ఆ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి సర్పంచులుగా ఎన్నికైన తర్వాత ఆ కోతులను పారద్రోలే ప్రయత్నాలు చేస్తూ మాటను నిలబెట్టుకుంటున్నారు సర్పంచులు. అయితే మరికొన్ని ప్రాంతాలలో మాత్రం కోతుల బెడదను తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి బెడద నుండి బయటపడకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా వినూత్న పద్ధతిని ప్లాన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఢిల్లీ అసెంబ్లీ పరిసరాలలో కోతుల బెడద ఎక్కువ కావడంతో వీటిని తగ్గించడానికి ప్రభుత్వం ఒక వింత ప్లాన్ చేసింది. గతంలో వీటిని భయపెట్టడానికి కొండముచ్చుల కటౌట్ లను ఏర్పాటుచేసినా వర్కౌట్ కాలేదు.. ఇక వాటికి కోతులు ఏమాత్రం భయపడకపోవడంతోనే ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ వేసింది. కొండముచ్చుల అరుపులను మిమిక్రీ చేసే వ్యక్తులను పనిలో పెట్టబోతోంది. ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇదైనా వర్కౌట్ అవుతుందా? అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది కోతుల బెడద సంగతేమో కానీ వీటిని పారద్రోలడానికి మిమిక్రీ ఆర్టిస్టులను పెట్టి వారికంటూ ఉపాధిని కల్పిస్తున్నారు అని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ కోతుల బెడదను తగ్గించడానికి, కోతులను తరిమి కొట్టడానికి పటాకులు కాల్చడం , నీటితో కొట్టడం, శబ్దాలు చేయడంతో పాటు బేర్ వేషం వేయడం వంటి వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. మరి కొంతమంది అధికారుల సమక్షంలో వాటిని జాగ్రత్తగా అడవులకు తరలిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కోతుల బెడద తగ్గించడానికి ఏకంగా ప్రభుత్వాలు రంగంలోకి దిగుతుండడం ఆశ్చర్యకరం.
