Begin typing your search above and press return to search.

గంగానదిలో బికినీ స్నానమా? సిగ్గు సిగ్గు.. ఇదేం పద్ధతి..

పవిత్ర గంగా తీరంలో ఇలాంటి దుస్తులు ధరించి స్నానం చేయడం హిందూ సంప్రదాయాలకు విరుద్ధం అని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

By:  A.N.Kumar   |   22 Oct 2025 12:19 PM IST
గంగానదిలో బికినీ స్నానమా? సిగ్గు సిగ్గు.. ఇదేం పద్ధతి..
X

భారతీయుల మనసుల్లో అత్యంత పవిత్రంగా నిలిచినది గంగా నది. హిందూ సంప్రదాయాల ప్రకారం గంగాస్నానం అంటే పాప ప్రక్షాళన, శుద్ధి, ఆధ్యాత్మిక శాంతి. ప్రతీ ఏడాది కోట్లాది మంది భక్తులు గంగా నదిలో స్నానం చేసి పుణ్యం పొందుతారు. ఇంత పవిత్రంగా భావించే ఈ నదిలో ఒక విదేశీ పర్యాటకురాలు బికినీ ధరించి స్నానం చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ వద్ద చోటుచేసుకుంది. ఆ యువతి మెడలో పూలదండలు వేసుకుని గంగా నదిలోకి దిగింది. తరువాత దండలను నీటిలో వదిలి ఈత కొడుతూ వీడియోలో కనిపించింది. ఆ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి, నెటిజన్ల మధ్య విభిన్న అభిప్రాయాలకు దారి తీసింది.

* పరంపరావాదుల ఆగ్రహం

పవిత్ర గంగా తీరంలో ఇలాంటి దుస్తులు ధరించి స్నానం చేయడం హిందూ సంప్రదాయాలకు విరుద్ధం అని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “రిషికేష్ వంటి ఆధ్యాత్మిక క్షేత్రం పవిత్రతను కాపాడాలి”, “గంగానది దేవతామూర్తి” అని భావించే వారు, ఆ విదేశీ మహిళ చర్యను అపవిత్రం అని అభివర్ణిస్తున్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.

* వ్యక్తిగత స్వేచ్ఛ వాదన

మరోవైపు, కొందరు నెటిజన్లు మాత్రం “దుస్తులు వ్యక్తిగత స్వేచ్ఛ” అని అంటున్నారు. పురుషులు లోదుస్తులతో స్నానం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరా, అయితే మహిళ చేస్తే ఎందుకు తప్పు అని ప్రశ్నిస్తున్నారు. సాంప్రదాయాల పేరుతో మహిళల స్వేచ్ఛను పరిమితం చేయరాదని వాదిస్తున్నారు.

* విలువల మధ్య పోరాటం

ఈ సంఘటనతో భారతీయ సమాజంలో ఆధునికత vs ఆచారం మధ్య సాగే విలువల పోరాటం మరోసారి ముందుకు వచ్చింది. ఒకవైపు పవిత్రత, పరంపర, సంస్కృతి రక్షణ అవసరం ఉంటే, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక హక్కు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉన్నాయనే దృష్టికోణం వ్యక్తమవుతోంది.

* పరిష్కారం ఏమిటి?

నిపుణులు చెబుతున్నదేమిటంటే రిషికేష్, వారణాసి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లోకి వచ్చే విదేశీ పర్యాటకులకు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు ముందుగానే వివరించడం అవసరం. గౌరవపూర్వకమైన అవగాహన ఉంటే ఇలాంటి వివాదాలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

మొత్తానికి, గంగానది కేవలం నీటిమార్గం కాదు.. అది కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. దానిపట్ల గౌరవం అవసరం, కానీ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం కూడా సమానంగా ముఖ్యమే. సంస్కృతి, ఆధునికత.. ఈ రెండింటి మధ్య సమతుల్యతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలపై సమాధానం కావచ్చు.