Begin typing your search above and press return to search.

ఇంటి కోసం అర్ధరాత్రి పంత్ ట్వీట్.. సీఎం సంచలన స్పందన.. వైరల్

నాయకులు అర్ధరాత్రి సేవలు చేయడం విన్నాం గానీ.. కోట్లు సంపాదించే క్రికెటర్లు అర్ధరాత్రి ఆస్తుల కోసం ట్వీట్లు చేయడం బహుశా ఇదే తొలిసారేమో..

By:  A.N.Kumar   |   8 Aug 2026 11:55 AM IST
ఇంటి కోసం అర్ధరాత్రి పంత్ ట్వీట్..  సీఎం సంచలన స్పందన.. వైరల్
X

నాయకులు అర్ధరాత్రి సేవలు చేయడం విన్నాం గానీ.. కోట్లు సంపాదించే క్రికెటర్లు అర్ధరాత్రి ఆస్తుల కోసం ట్వీట్లు చేయడం బహుశా ఇదే తొలిసారేమో.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఎక్స్ ఖాతా నుంచి ఇటీవల వెలువడిన ఓ సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. అదే సమయంలో సలసల కాగుతున్న చర్చకూ దారితీస్తోంది.

అయ్యా సీఎం గారూ.. సొంతింటికి స్థలమివ్వండి..

అర్ధరాత్రి 12:46 గంటలకి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన సమయంలో పంత్ ఖాతా నుంచి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఓ వినతిపత్రం లాంటి పోస్ట్ వెళ్లింది. "నేను దిల్లీలో ఉంటున్నా.. తిరిగి మన దేవభూమికి వచ్చేయాలి అనుకుంటున్నా. మూడేళ్లుగా వెతుకుతున్నా మంచి ల్యాండ్ దొరకట్లేదు. బ్రాండ్ అంబాసిడర్‌గా నాకొక భూమి కేటాయిస్తే ప్రభుత్వం చెప్పిన ధరకు కొనుక్కుంటా" అనేది ఆ పోస్ట్ సారాంశం. కోట్లకు అధిపతి, ఐపీఎల్ స్టార్ అయిన పంత్‌కు సొంత రాష్ట్రంలో మూడేళ్లుగా ఒక గజం ల్యాండ్ దొరక్కపోవడం ఏంటో దానికి సీఎం స్థాయి వ్యక్తి సహాయం కోరడం ఏంటో అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు!

పరిపాలన ప్రతాపం.. సీఎం తక్షణ స్పందన

ఇక మన సీఎం ధామి గారు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. "పంత్ మన రాష్ట్ర గర్వకారణం.. మాతృభూమిపై అతడికి ఉన్న ప్రేమ అభినందనీయం" అని మెచ్చుకుంటూ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసేస్తానని రిప్లై ఇచ్చేశారు. సామాన్యుడి అర్జీ ఏళ్ల తరబడి మూలన పడినా పట్టించుకోని వ్యవస్థ అర్ధరాత్రి పంత్ నుంచి వచ్చిన పోస్టుకు గంటల్లోనే 'అధికారుల సంప్రదింపుల' దాకా వెళ్లడం చూసి జనాలు తెగ సంబరపడిపోతున్నారు.

హ్యాక్ అయిందా? లేక మైండ్ బ్లాక్ అయిందా?

శ్రీలంక పర్యటనలో సిరీస్ ఆడటంలో బిజీగా ఉన్న పంత్‌కు ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ వ్యాకరణ లోపాలతో నిండిన సుదీర్ఘ పోస్ట్ పెట్టాల్సిన అవసరమేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. "ల్యాండ్ దొరకకపోతే స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్లను కలవాలి కానీ ఏకంగా సీఎంకు ట్వీట్ చేస్తారా బ్రో?" అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇది నిజంగా పంత్ చేసిన పోస్టా? లేక ఆయన అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా? లేక ఏదైనా ల్యాండ్ మాఫియా ప్లానా? అని అభిమానులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పంత్ నోరు విప్పి "అది నేను కాదు సామీ " అని ప్రకటిస్తే తప్ప, ఈ అర్ధరాత్రి 'రియల్ ఎస్టేట్ డ్రామా'కు క్లారిటీ వచ్చేలా లేదు. అప్పటివరకు సీఎం ధామి ఇచ్చిన హామీ పంత్ ఖాతా నుంచి వచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో మీమ్ రాయుళ్లకు కావాల్సినంత మేత అందిస్తూనే ఉంటాయి.