అర్ధరాత్రి రిషబ్ పంత్ సంచలన ట్వీట్.. పెను దుమారం
మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో ఇల్లు కట్టుకుందామని వెతుకుతున్నా, తన రేంజ్‌కి తగ్గ పెద్ద 'ల్యాండ్' దొరకట్లేదని పంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
By: A.N.Kumar | 8 Aug 2026 10:06 AM ISTటీమిండియా క్యాచ్‌లు పట్టడంలో గ్రౌండ్‌లో ప్రత్యర్థులపై సెటైర్లు వేయడంలో రిషభ్ పంత్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈసారి పంత్ విసిరిన 'ట్వీట్' బంతి నేరుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ముంగిట్లోనే పడింది. శనివారం అర్ధరాత్రి 12:46 గంటలకు నిద్రపట్టకో లేక ‘సొంతింటి’ కల గుర్తొచ్చో ఏమో కానీ.. ఎక్స్ వేదికగా పంత్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో ఇల్లు కట్టుకుందామని వెతుకుతున్నా, తన రేంజ్‌కి తగ్గ పెద్ద 'ల్యాండ్' దొరకట్లేదని పంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం పరువు నిలబెడుతున్నా కాబట్టి ప్రభుత్వం ఏమైనా గిఫ్ట్‌గా ల్యాండ్ ఇస్తే హ్యాపీ అని.. ఒకవేళ అలా వీలు కాకపోతే గవర్నమెంట్ రేటు చెబితే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానని సీఎం గారిని నేరుగా అడిగేశాడు. అంతే కాదు తనకు ఈ ల్యాండ్ కొనుగోలు ప్రాసెస్ ఏంటో అస్సలు తెలీదని.. కాస్త దారి చూపించి మార్గనిర్దేశం చేయాలంటూ సీఎం సాబ్‌కు అమాయకంగా అర్ధరాత్రి వేళ విజ్ఞప్తి చేశాడు.
ఇక ఈ అర్ధరాత్రి ట్వీట్ చూసిన నెటిజన్లకు, మీమర్లకు మంచి వినోదం దొరికినట్లయింది. ఆ పోస్టులో ఉన్న అక్షర దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్‌లు చూసి పంత్ భాయ్ రాత్రి పూట కాస్త ‘మత్తు’లో ఏమైనా ట్వీట్ చేశావా ఏంటి అంటూ మీమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా చెలరేగిపోతున్నారు. లండన్, ఢిల్లీలలో సొంత ఇళ్లు ఉన్నోడివి.. ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 27 కోట్లు పెట్టి కొంటే లక్నో టీమ్‌లోకి వెళ్లినోడివి.. ఏడాదికి దాదాపు రూ. 23 కోట్ల పైచిలుకు ఇన్కమ్ టాక్స్ కట్టేంత రేంజ్ ఉన్నోడివి, నీకు కూడా భూమి దొరకకపోవడం ఏంటి భాయ్ అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అంత కోటీశ్వరుడవై ఉండి సీఎంను ‘ఫ్రీగా లేదా ఆఫీషియల్ రేటుకి’ ల్యాండ్ అడగడం ఏంటయ్యా స్వామీ అని నవ్వుకుంటున్నారు.
మరోవైపు ఒకపక్క శ్రీలంక పర్యటనలో ఉండి ప్రాక్టీస్ చేసి క్రికెట్‌పై దృష్టి పెట్టాల్సింది పోయి.. అర్ధరాత్రి వేళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటి భాయ్ అంటూ కొందరు కారంగా సెటైర్లు వేస్తుంటే.. మా ఊరి పిల్లోడు సొంత రాష్ట్రంలో స్థిరపడదామని ఇల్లు కట్టుకుందామంటే తప్పేంటి అని పంత్ ఫ్యాన్స్ కవరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అర్ధరాత్రి వేళ పంత్ విసిరిన ఈ 'ట్విట్టర్ గూగ్లీ'కి ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సీఎం సాబ్ పంత్‌కు స్థలం కేటాయిస్తారో లేక 'ప్రాసెస్ ఆన్‌లైన్‌లో ఉందిలే' అని క్యాచ్ వదిలేస్తారో వేచి చూడాల్సిందే.
