ఫైనాన్స్ పాఠం: మీ ఇంటితో మీకు పింఛను!
అలాంటప్పుడు పెన్షన్ మాదిరి ప్రతి నెలా ఇంటి మీద బ్యాంకులు ఎందుకు డబ్బులు ఇస్తాయి? అన్న సందేహం రావొచ్చు.
By: Garuda Media | 25 Aug 2025 12:00 AM ISTసొంతిల్లు ఓ అందమైన కల. దాని సాకారం కోసం అందరూ ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతింటి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం.. వాటిని తిరిగి కట్టేందుకు నెలా వారీగా ఈఎంఐలు చెల్లించటం లాంటివి చేస్తుంటారు. అందరికి ఈ విషయాలు తెలియనివే. అయితే.. ఇంటి మీద అప్పు తీరిపోయి.. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఉన్న దారులు అయితే ఇంటిని అమ్మేయటం లేదంటే ఇంట్లో కొంత భాగాన్ని అద్దెకు ఇవ్వటం.
అయితే.. బ్యాంకింగ్ రంగంలో ఉన్న కొన్ని వసతులు అతి కొద్దిమందికే తెలుస్తాయి. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. పెద్ద వయసులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల్ని అధిగమించేందుకు వీలుగా బ్యాంకులు రివర్సులో పెన్షన్ పద్దతిలో డబ్బులు ఇచ్చే ఒక సౌకర్యం ఉందని మీకు తెలుసా? వ్యక్తిగత ఇంటికి మాత్రమే కాదు.. అపార్టుమెంట్ ప్లాట్ కు సైతం ఇలాంటి వసతే ఉంది. అదెలా సాధ్యం? బ్యాంకులు ఎందుకు వస్తాయి? వయసు పెరిగే కొద్దీ.. అప్పు ఇవ్వటానికి ఇష్టపడవు కదా?
అలాంటప్పుడు పెన్షన్ మాదిరి ప్రతి నెలా ఇంటి మీద బ్యాంకులు ఎందుకు డబ్బులు ఇస్తాయి? అన్న సందేహం రావొచ్చు. దానికో లెక్కుంది. అదేమంటే.. ఈ విధానాన్ని రివర్సు మార్ట్ గేజ్ అని పిలుస్తారు. సాధారణంగా మనందరికి మార్ట్ గేజ్ గురించి తెలుసు. డబ్బుల్ని బ్యాంకులు మనకు ఇస్తాయి. తిరిగి వాటిని ఈఎంఐ పద్దతుల్లో చెల్లిస్తాం. అయితే.. రివర్సు మార్ట్ గేజ్ విధానంలో.. పెద్ద వయస్కులైన వారికి అండగా ఉండేందుకు.. ఇంటిని తాకట్టుగా తీసుకుంటాయి. ప్రతి నెలా వారికి ఉండే అర్హత ఆధారంగా పెన్షన్ మాదిరి డబ్బులు చెల్లిస్తారు.
ఆస్తి విలువ ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. మరి..దీని వల్ల బ్యాంకులకు కలిగే లాభం ఏమిటి? అన్న ప్రశ్న రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. పెద్ద వయస్కులకు పెన్షన్ రూపంలో బ్యాంకులు చెల్లించే మొత్తాన్ని.. వారి తదనంతరం ఆస్తిని బ్యాంకులు అమ్మేయటం ద్వారా కానీ.. లేదంటే వారి వారసులు బ్యాంకుకు కట్టాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే.. వారికి ఆ ఆస్తి ఇస్తారు. ఆర్థిక అవసరాల కోసం ఇంటిని అమ్మేయటం లాంటి చికాకులకు పరిష్కారంగా ఈ మార్గాన్ని చెప్పొచ్చు. ఈ విధానం 60 ఏళ్ల తర్వాత నుంచి బ్యాంకులు అందిస్తాయి. అయితే.. ఆస్తి విలువ ఆధారంగానే నెల వారీగా ఎంత మొత్తాన్ని ఇవ్వాలన్న విషయాన్ని బ్యాంకులు డిసైడ్ చేస్తాయి. జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులకు ఇదో చక్కటి పరిష్కారంగా చెప్పక తప్పదు.
