Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న భారతీయులు. కారణం ట్రంప్ ఎఫెక్ట్..!

ఒకప్పుడు భారతదేశం నుంచి మేధావులంతా అమెరికాకు తరలి వెళ్లేవారు (Brain Drain). కానీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 April 2026 4:00 PM IST
అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న భారతీయులు. కారణం ట్రంప్ ఎఫెక్ట్..!
X

ఒకప్పుడు భారతీయులకు విపరీతమైన డాలర్ డ్రీమ్ (అమెరికా కల) ఉండేది. అంటే ప్రతి భారతీయ విద్యార్థికి, నిపుణుడికి ఒక అమెరికా వెళ్లాలనే లక్ష్యం ఉండేది. కానీ అది మారుతుంది.. అది కూడా వేగంగా.. ‘కార్నెగీ ఎండోమెంట్ సర్వే’ వెల్లడించిన ఈ గణాంకాలు చూస్తుంటే, అగ్రరాజ్యంలో పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థం అవుతోంది. డాలర్ల కంటే ఆత్మగౌరవం, భద్రతే ముఖ్యమని భారతీయులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడటం అనేది ఒక సామాజిక హోదాగా భావించే రోజులు రాను రాను వేగంగా పోతున్నాయి. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయుల్లో నలుగురు (40%) అమెరికాను వీడి మళ్లీ భారతదేశానికి లేదంటే ఇతర దేశాలకు వెళ్లాలని యోచిస్తున్నారట. విద్వేషపూరిత దాడులు, వీసా అనిశ్చితి, రాజకీయ మార్పులు కలిసి ఇండో-అమెరికన్ కమ్యూనిటీలో ఒక విధమైన అభద్రతా భావాన్ని కలిగించాయి.

ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’.. భారతీయుల ‘లాస్ట్’?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై 71 శాతం మంది భారతీయులు అసంతృప్తితో ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ‘అమెరికా అమెరికన్ల కోసమే’ అనే నినాదం భారతీయులను మానసికంగా దెబ్బతీసింది. దశాబ్దాలుగా అక్కడ ఉండి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన ఐటీ నిపుణులు కూడా తాము 'పరాయివాళ్లం' అనే ముద్రతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు హెచ్-1బీ హోల్డర్లను వేధించడం, వారి ఇళ్ల వద్దకు వచ్చి డాక్యుమెంట్లు అడగడం వంటి ఘటనలు ఈ అభద్రతా భావానికి ఆజ్యం పోశాయి.

సంక్షోభంలో కమ్యూనిటీ

భారతీయులు అమెరికాలో అత్యంత విజయవంతమైన మైనారిటీ గ్రూపుగా గుర్తింపు పొందారు. కానీ నేడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. వలస వ్యతిరేక కంటెంట్ ఆన్ లైన్ లో పెరగడం వల్ల సామాన్య అమెరికన్లు కూడా భారతీయులను అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఐటీ రంగంలో వస్తున్న లేఆఫ్స్, వీసా పొడిగింపులో జరుగుతున్న జాప్యం వల్ల ‘డాలర్ డ్రీమ్స్’ ఇప్పుడు భారంగా మారుతున్నాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి పెరగడం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ‘ఇక్కడ ఎందుకు కష్టపడాలి.. మన దేశానికే వెళ్లిపోదాం’ అనే ధోరణి పెరిగింది.

అమెరికాను ఎందుకు వీడాలనుకుంటున్న వారు..?

సర్వేలో పాల్గొన్న వారు అమెరికాను వీడేందుకు ప్రధానంగా మూడు కారణాలను చూపిస్తున్నారు. పెరిగిపోతున్న గన్ కల్చర్, జాత్యహంకార దాడుల వల్ల తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల నిరీక్షణ, హెచ్-1బీ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల స్వేచ్ఛగా బతకలేకపోతున్నామని వారు వాపోతున్నారు. పరాయి దేశంలో వివక్షను భరిస్తూ ఉండడం కంటే, స్వదేశంలో గౌరవంగా బతకడం మేలని భావిస్తున్నారు.

రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్

ఒకప్పుడు భారతదేశం నుంచి మేధావులంతా అమెరికాకు తరలి వెళ్లేవారు (Brain Drain). కానీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడుతున్నాయి. 40 శాతం మంది భారతీయులు అమెరికాను వీడాలని అనుకోవడం అనేది అగ్రరాజ్యానికి ఒక హెచ్చరిక. అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులు గనుక అమెరికాను వీడితే, ఆ దేశ టెక్నాలజీ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది. మరోవైపు, ఈ ‘రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్’ వల్ల భారతదేశానికి అద్భుతమైన ప్రతిభావంతులు తిరిగి వచ్చే అవకాశం ఉంది.