రివర్స్ ఏజింగ్ ఇంజెక్షన్ : అప్పుడు ప్రతి తాతా ‘యూత్ ఐకాన్’ కావడం ఖాయం
‘ఈఆర్-100’ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగంలో భాగంగా గ్లకోమా కంటి చూపు సమస్య తో బాధపడుతున్న ఒక రోగికి సింగిల్ జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చారు.
By: A.N.Kumar | 11 Jun 2026 8:15 AM ISTప్రపంచం మొత్తం ఇప్పటివరకు వృద్ధాప్యాన్ని ఒక సహజ ప్రక్రియగా భావిస్తూ "వచ్చిన ముడతలను దాచలేం.. ఊడిన జుట్టును తేలేం" అని సర్దుకుపోయింది. కానీ ఇప్పుడు బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి "అదంతా మీ భ్రమ... ముసలితనం అనేది ఒక జబ్బు దానికి మేం మందు కనిపెడతాం" అని సరికొత్త సవాల్ విసురుతున్నారు. అమెరికాకు చెందిన ఓ బయోసైన్సెస్ సంస్థ తాజాగా ప్రయోగించిన తొలి ‘రివర్స్ ఏజింగ్ ఇంజెక్షన్’ చూస్తుంటే త్వరలోనే "ముసలితనం" అనే పదానికి డిక్షనరీలో చోటు లేకుండా చేసేలా ఉన్నారు!
‘ఈఆర్-100’ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్!
‘ఈఆర్-100’ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగంలో భాగంగా గ్లకోమా కంటి చూపు సమస్య తో బాధపడుతున్న ఒక రోగికి సింగిల్ జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చారు. సైంటిస్టుల లెక్కల ప్రకారం ఈ ఇంజెక్షన్ వల్ల సదరు రోగి కంటి చూపు మెరుగుపడటమే కాకుండా అతని శరీరంలోని కణాలు మళ్లీ వెనక్కి ప్రయాణించి యవ్వనంలోకి అడుగుపెడతాయట. అంటే భవిష్యత్తులో వయసు పెరిగితే "ముసలివాళ్లం అయ్యాం" అని బాధపడక్కర్లేదు "బాడీలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయింది" అని కాలర్ ఎగరేయవచ్చు!
నెటిజన్ల ఫన్నీ పంచ్‌లు.. తాతల జిమ్ ప్లాన్లు!
ఈ వార్త బయటికి రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు "ఈ ఇంజెక్షన్ గనుక మార్కెట్లోకి వస్తే ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుండి 150 ఏళ్లకు పెంచేస్తుందేమో?" అని కొందరు భయపడుతున్నారు. "మరి ఇప్పటివరకు ముడతలు పోగొడతాం అని కోట్లు సంపాదించిన యాంటీ ఏజింగ్ క్రీముల కంపెనీల పరిస్థితి ఏంటి? బోర్డులు తిప్పేయాల్సిందేనా?" అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు ఈ న్యూస్ విన్న కొందరు 70 ఏళ్ల తాతలు అప్పుడే ఉత్సాహంతో జిమ్ మెంబర్‌షిప్‌లు రీన్యూ చేయించుకోవడానికి లైన్లలో నిల్చున్నారట. అద్దంలో ముడతలు చూసుకుంటూ బాధపడే కాలం పోయి మునిమనవడితో కలిసి బైక్ రేసింగ్‌కు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంబరపడిపోతున్నారు. ఇకపై పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు "అబ్బాయి వయసు ఎంత?" అని అడిగితే... "ఆధార్ కార్డులో 80 ఏళ్లు కానీ నిన్ననే ఇంజెక్షన్ చేయించుకున్నాడు కాబట్టి బయోలాజికల్‌గా 25 ఏళ్లు" అని సమాధానాలు వినాల్సి వస్తుందేమో!
ట్విస్ట్ ఏంటంటే...
శాస్త్రవేత్తలు మాత్రం ఈ సంబరాలను చూసి "బాబోయ్.. కాస్త ఆగండి" అంటున్నారు. ప్రస్తుతం ఇది కేవలం ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రయోగం మాత్రమే. ఈ ‘యవ్వన బాణం’ ఎంతవరకు పక్కాగా పనిచేస్తుందో తెలియడానికి ఇంకా సమయం పడుతుంది.
ఏదేమైనా ఈ ప్రయోగం గనుక 100% సక్సెస్ అయితే... భవిష్యత్తులో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు.. ఒక ఆప్షన్ మాత్రమే! అప్పుడు ప్రతి తాతా ‘యూత్ ఐకాన్’ కావడం ఖాయం!
