Begin typing your search above and press return to search.

మోడీని ఎందుకు క‌లుస్తున్నారో చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణ కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. చెమ‌టోడుస్తాన‌ని, ర‌క్తం ధార‌పోస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

By:  Garuda Media   |   17 Jan 2026 1:09 AM IST
మోడీని ఎందుకు క‌లుస్తున్నారో చెప్పిన సీఎం రేవంత్!
X

తెలంగాణ కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. చెమ‌టోడుస్తాన‌ని, ర‌క్తం ధార‌పోస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లా లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ప‌లు ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. అనంత‌రం.. నిర్మ‌ల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తాను ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వ‌స్తోందో వివ‌రించారు. అయితే.. ఇదే స‌మ‌యంలో తన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఇటు రాజ‌కీయాల్లోనూ.. అటు సోష‌ల్ మీడియాలోనూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పైనా ఆయ‌న స్పందించారు. తాను ఢిల్లీకి ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి వెళ్తున్న‌ది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్రం కోసం ప్ర‌ధానిని క‌లుస్తున్న‌దీ వాస్త‌వ‌మేన‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఇదంతా .. రాష్ట్రం కోస‌మేన‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన‌వి చాలా ఉన్నాయ‌ని.. క‌య్యానికి పోతే అవేవీ వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. అందుకే. మ‌న‌కు ఏం కావాలో.. ఏం రావలో ప్ర‌ధాని మోడీని క‌లిసి వివ‌రిస్తున్నాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఎవ‌రినైనా క‌లిసేందుకు తాను సిద్ధ‌మేన‌న్నారు. త‌న‌కు ఢిల్లీలో సొంత అజెండా అంటూ ఏమీ లేద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లే త‌న అజెండా అని.. ఇక్క‌డి స‌మ‌స్య ల ప‌రిష్కారం కోస‌మే తాను ప‌దే ప‌దే ఢిల్లీకి వెళ్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

కేసీఆర్‌పై..

ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎత్త‌కుండానే రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప‌దేళ్ల‌లో ఇక్క‌డి నుంచి ఒక్క రిప్ర‌జెంటేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌న్నారు. రాజ‌కీయంగా ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌ని భావించిన పెద్ద‌మ‌నిషి.. ఏదో చేయాల‌ని అనుకుని రాష్ట్రాన్ని గాలికి వ‌దిలేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ఇప్పుడు స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని.. తాను ఢిల్లీ చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. ఇక్క‌డి స‌మ‌స్య‌లు చెప్ప‌క‌పోతే.. ఢిల్లీ పెద్ద‌ల‌కు ఎలా తెలుస్తాయ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రితోనూ పైర‌వీలు చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఆదిలాబాద్‌పై వ‌రాలు..

ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వ‌రాలు కురిపించారు. జిల్లాకు ఎయిర్ బ‌స్ తీసుకువ‌స్తామ‌న్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమిని కూడా సేక‌రించ‌నున్న‌ట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌ధానిని ఆహ్వానించ‌నున్నట్టు తెలిపారు. బాసర ట్రిపుల్‌ ఐటీలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ను ఇండ‌స్ట్రియ‌ల్ జిల్లాగామారుస్తామ‌ని, ఇక్క‌డివారు వ‌ల‌స‌లు పోకుండా.. ఇక్క‌డే ఉపాధి ల‌భించేలా ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇక్క‌డి ఎస్టీ ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకొనే `నాగోబా` జాతరకు 22 కోట్ల రూపాయ‌లు మంజూరు చేయ‌నున్న‌ట్టు హామీ ఇచ్చారు. దీనిని రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.