కవితకు రేవంత్ అనూహ్య మద్దతు...టీ పాలిటిక్స్ లో న్యూ యాంగిల్
తెలంగాణాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య కత్తులు దూసుకునే పరిస్థితి. ఆ పార్టీ ఇంటి గోడ మీద కాకి ఈ పార్టీ ఇంటి గోడ మీదకు వాలనంతగా రాజకీయ వైరం సాగుతోంది.
By: Satya P | 3 Nov 2025 1:00 AM ISTతెలంగాణాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య కత్తులు దూసుకునే పరిస్థితి. ఆ పార్టీ ఇంటి గోడ మీద కాకి ఈ పార్టీ ఇంటి గోడ మీదకు వాలనంతగా రాజకీయ వైరం సాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన సభలో కేసీఆర్ అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన రెండేళ్ళుగా అసెంబ్లీకి రావడమే మానుకున్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావులే సభలో అధికార కాంగ్రెస్ ని నిలదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా బీఆర్ఎస్ ల ముఖ్య నాయకురాలిగా ఉంటూ ఆ పార్టీ చేత సస్పెండ్ చేయబడి తన రాజకీయ దారి వెతుక్కుంటున్న కవిత విషయంలో కాంగ్రెస్ ఇపుడు కొత్త వైఖరిని చూపిస్తోందని అంటున్నారు. కేసీఆర్ సొంత బిడ్డ కవిత కాంగ్రెస్ కి ఎందుకు అంతగా నచ్చేశారు, ఆమెకు ఈ కీలక సమయంలో అనూహ్యంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అదే తెలంగాణా పాలిటిక్స్ లో సరికొత్త తమాషా అని అంటున్నారు.
చెల్లెలుకు అన్యాయం అంటూ :
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అంతే కాదు ఆయన ఏకంగా బీఆర్ఎస్ అగ్రనేతల కుటుంబ రాజకీయాలను సైతం టచ్ చేస్తున్నారు. సొంత చెల్లెలు కవితను ఆదరించలేని వారు అని కేటీఆర్ ని నేరుగా ఎటాక్ చేస్తున్నారు ఆమెకు ఎక్కడ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందో అని దూరం పెట్టేశారు అని కేటీఆర్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అంతే కాదు కేసీఅర్ సీఎం గా ఉండగా ఆర్జించిన సంపదలో చెల్లెలుకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించేశారు అని కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు.
ఏమీ చేయని అన్న :
సొంత చెల్లెలుకే ఏమీ చేయని అన్న కేటీఅర్ ప్రజలకు ఏ రకమైన న్యాయం చేస్తారని కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్తి వివాదాల వల్లనే ఆమెను పక్కన పెట్టేసారు అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత కన్నీళ్ళు పెట్టుకోవడం వల్లనే ప్రజల ముందు కేటీఆర్ గురించి ఈ విధంగా తాము ప్రశ్నించాల్సి వస్తోందని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఎవరికి అయినా విలువలు ఉండాలని అవి సమాజానికి ఆదర్శంగా ఉండాలని కేటీఆర్ ని దెప్పి పొడిచారు. మొత్తంగా ఇవన్నీ చూస్తూంటే హఠాత్తుగా కవిత సైడ్ తీసుకుని రేవంత్ రెడ్డి మద్దతుగా నిలవడం పట్ల చర్చ సాగుతోంది.
ఏపీలో హిట్ ఫార్ములా :
ఇక అన్నా చెల్లెలు వివాదం అది జనంలో ఉంచడం ద్వారా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీగా లబ్ధి పొందింది. అదే సమయంలో వైఎస్ జగన్ సీఎం గా ఉండగా ఆయనను విభేదించి సొంత చెల్లెలు షర్మిల జనంలోకి వచ్చారు ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉంటూ అన్న మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. అవన్నీ కూడా జనంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి కూడా. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం షర్మిల ఎపిసోడ్ కూడా అని అంతా అంటారు.
ఇపుడు తెలంగాణాలో కూడా అలాంటి యాంటీ సెంటిమెంట్ నే తీసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తోందా అన్న చర్చ సాగుతోంది. అయితే కవితకు షర్మిలకు తేడా ఉంది అని అంటున్నారు. షర్మిల బాహాటంగా అన్నను వ్యతిరేకిస్తే కవిత మాత్రం అన్నని ఏమీ విమర్శలు చేయడం లేదు, అయితే ఆమెకు అన్యాయం చేసింది కేటీఆర్ అని కాంగ్రెస్ ఎత్తి చూపిస్తోంది. దీంతో ఈ ప్రచారం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది అంతా చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఉన్నట్లుండి కేసీఆర్ తనయకు మద్దతుగా నిలవడం మీద కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి తెలంగాణా రాజకీయాలు ఏ కీలక మలుపు తిరుగుతాయో అన్నది.
