పోల్ మేనేజ్ మెంట్ లో చతికిలపడ్డ కారు పార్టీ.. ఎందుకిలా?
ఎంతటి తోపు ఆటగాడికైనా.. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మైదానంలో తన ఆటను ప్రదర్శించే విషయంలో ఫెయిల్ అవుతాడు.
By: Garuda Media | 12 Nov 2025 9:32 AM ISTఎంతటి తోపు ఆటగాడికైనా.. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మైదానంలో తన ఆటను ప్రదర్శించే విషయంలో ఫెయిల్ అవుతాడు. తాజాగా ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అలాంటి అనుభవమే కారు పార్టీకి ఎదురైందన్న మాట బలంగా వినిపిస్తోంది. పోల్ మేనేజ్ మెంట్ లో తోపు పార్టీగా.. దాన్ని ఢీ కొనే సత్తా మరే పార్టీకి లేదన్నట్లుగా చెప్పే బీఆర్ఎస్ కే కొత్త పాఠాలు నేర్పేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాగిందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తన సత్తా చాటిన అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ కు భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోల్ మేనేజ్ మెంట్ సాగిందని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు అంటే.. పదేళ్ల (2014-2023) కాలంలో చాలానే ఉప ఎన్నికల్ని తెలంగాణ రాష్ట్రం చూసింది. అందులో ఒకట్రెండు మినహాయిస్తే.. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ బీఆర్ఎస్ కు తిరుగులేని పరిస్థితి. ఎన్నిక ఏదైనా.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో పక్కా ప్లాన్ తో మొదలు పెట్టి.. ఫలితం తమకు అనుకూలంగా వచ్చే వరకు విడిచిపెట్టని మొండితనం గులాబీ పార్టీలో కనిపించేది.
అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ తన బాధ్యతగా తీసుకోగా.. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ వ్యక్తిగత పూచీ తీసుకున్నారు. దీంతో.. ఈ ఊపపోరుకు ఎక్కడ లేని ప్రాధాన్యత లభించింది. దీనికి తోడు ఈ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ రెండేళ్ల ప్రభుత్వ పాలనకు రిఫరెండమ్ గా పేర్కొనటంతో అధికార పక్షం మరింత అలెర్టు అయ్యింది.
ఉప పోరు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ కు మూడు రోజుల ముందు వరకు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న కారు పార్టీ.. తీరా కీలకమైన పోలింగ్ కు ముందు మూడు రోజుల నుంచి ఆత్మవిశ్వాసం లోపించినట్లుగా చెప్పాలి. దీనికి కారణం కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన మైండ్ గేమ్ కూడా కారణంగా చెప్పాలి. ఎన్నికల్లో విజయం తప్పించి మరింకేమీ తమకు అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. మంత్రులు మొదలు కింది స్థాయి నాయకుడు సైతం గెలుపు కోసం పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవటం కోసం మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత విపరీతంగా శ్రమించారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఉప ఎన్నిక పోలింగ్ కు ఐదు రోజుల ముందు వరకు అంత సీరియస్ గా తీసుకోని మంత్రులు.. కాంగ్రెస్జూబ్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ముఖ్యమంత్రి రేవంత్ జోక్యంతో ఒళ్లు వంచి పని చేశారు. ఎక్కడ చూసినా.. ఏ మూల చూసినా గెలుపు ధీమా వ్యక్తమయ్యేలా చేసిన ప్రయత్నం బీఆర్ఎస్ నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసింది.
అదే.. చివరివరకు పోరాడే లక్షణాన్ని మిస్ అయ్యేలా చేసింది. పోల్ మేనేజ్ మెంట్ లో తోపు అన్నట్లుగా ఉండే కారు పార్టీ.. కీలకమైన పోలింగ్ వేళ చేతులు ఎత్తేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి గెలుపును కట్టబెడుతూ తమ అంచనాలు వ్యక్తం చేశాయి. ఓట్ల లెక్కింపు వేళ.. ఇదే వాస్తవమైతే.. కారు పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చిన క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని చెప్పక తప్పదు.
