మున్సిపోల్స్ వేళ సీఎం రేవంత్ కీలక నిర్ణయం
పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పోటీగా రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేసి ఉంటే.. వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని.. పార్టీ ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
By: Garuda Media | 1 Feb 2026 12:18 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మున్సిపోల్స్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దావోస్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనతరం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లీడర్ షిప్ ఫర్ ది 21వ శతాబ్దం అన్న అంశానికి సంబంధించిన కోర్సు చేయటం తెలిసిందే. సదరు శిక్షణను విజయవంతంగా ముగించుకున్న ఆయన ఈ రోజు (ఆదివారం) అర్థరాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా మున్సిపోల్స్ కు సంబంధించి పార్టీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లు పునరావ్రతం కాకూడదన్న రేవంత్.. అందుకు అనుగుణంగా మున్సిపోల్స్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికల వేళ జీరో రెబెల్స్ వ్యూహాన్ని అమలు చేస్తే.. మెరుగైన ఫలితాలు సొంతం చేసుకోవటమే కాదు.. అత్యధిక మున్సిపాలిటీలు.. అన్ని కార్పొరేషన్లను సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పోటీగా రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేసి ఉంటే.. వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని.. పార్టీ ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 (మంగళవారం)న మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనున్న నేపథ్యంలో అమెరికా నుంచి పార్టీ ముఖ్యులతో వర్చువల్ గా భేటీ అయిన ఆయన.. మున్సిపోల్స్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ వర్చువల్ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్రరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగిందన్న ఆరాతో పాటు.. ఎమ్మెల్యే, ఇన్ ఛార్జుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొనే అభ్యర్థుల ఎంపిక జరిగిందా? లేదా? అన్న విషయాన్ని కనుక్కున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రెబెల్స్ కారణంగా సంపూర్ణ ఫలితాలు రాలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొనటం గమనార్హం. విదేశాల నుంచి తిరిగి వచ్చినంతనే బుధవారం (ఫిబ్రవరి 4) నుంచి సోమవారం (ఫిబ్రవరి 9) వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించటం.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం చేస్తారని చెబుతున్నారు.
