Begin typing your search above and press return to search.

గెలుపు ఫార్ములాను సీఎం రేవంత్ పట్టేశారా?

హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉపపోరులో అనూహ్య రీతిలో గౌరవప్రదానికి మించిన మెజార్టీతో విజయాన్నిసాధించటం ద్వారా తన బలాన్ని.. తన వ్యూహ చతురతను అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి.

By:  Garuda Media   |   14 Feb 2026 1:00 PM IST
గెలుపు ఫార్ములాను సీఎం రేవంత్ పట్టేశారా?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలుపు ఫార్ములాను ఒడిసి పట్టేశారా? విజయం ఆయనకు ఇప్పుడు సులువుగా లభిస్తోందా? సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఎదుర్కొన్న ఎన్నికలు.. వాటి ఫలితాలతో పోలిస్తే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత నుంచి ఆయన జోరును పెంచినట్లుగా కనిపిస్తుంది. హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉపపోరులో అనూహ్య రీతిలో గౌరవప్రదానికి మించిన మెజార్టీతో విజయాన్నిసాధించటం ద్వారా తన బలాన్ని.. తన వ్యూహ చతురతను అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత అన్న రెండు భాగాలుగా చూస్తే.. ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

అదే సమయంలో పార్టీ మీదా.. పార్టీ నేతల మీదా పట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ మధ్యనే ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో విజయాన్ని సాధించటంతో పాటు.. తమకున్న బలానికి తగినన్ని పంచాయితీలను సొంతం చేసుకోలేకపోయామన్న కొరత కాస్త ఉండేది. ఆ లోటును తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీర్చేసినట్లుగా చెప్పాలి. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగినప్పటికీ.. పార్టీ మద్దతుదారుల గెలుపును పరిగణలోకి తీసుకోవటం తెలిసిందే.

పంచాయితీ ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపాలిటీ , కార్పొరేషన్ ఎన్నికల్లో లభించిన తాజా విజయం సీఎం రేవంత్ ను మరింత బలంగా తయారుచేస్తుందని చెప్పాలి. ఈ ఊపులోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు.. తాజా ఎన్నికల్లో నిర్వహించని మున్సిపాలిటీలతో పాటు హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా మార్చిన నేపథ్యంలో.. ఈ మూడు చోట్ల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో తాను టార్గెట్ చేసిన చోట.. గెలుపును సొంతం చేసుకుంటున్నసీఎం రేవంత్ ను చూస్తే.. ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహంపై పూర్తి పట్టు వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పంచాయితీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ.. పక్షపాతంతో.. అధికారుల జోక్యంతో.. విపక్షాలను అణిచివేసి ఎన్నికలు నిర్వహించారన్న అపవాదు పడకుండా వ్యవహరించిన తీరు సీఎం రేవంత్ కు ఇప్పుడు లాభం చేయనుంది.

ప్రభుత్వ జోక్యానికి అతీతంగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు స్వేచ్ఛా వాతావరణంలో జరగటం.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించిన వైనం చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు తిరుగులేదనే మాట బలంగా వినిపిస్తోంది. అన్నింటికి మించి.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కొన్ని మున్సిపాలిటీల్లో ఖాతానే తెరవకపోవటం..కొన్నిచోట్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం చూస్తే.. రేవంత్ ఎన్నికల వ్యూహాలు పక్కాగా పని చేస్తున్నాయని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. గెలుపు ఫార్ములాను రేవంత్ క్రాక్ చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.