బీజేపీకి సంఘ్ కి మధ్య రేవంత్ చిచ్చు పెట్టారా ?
తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి అనేది తెలిసిందే. ఆయన తన వాక్చాతుర్యంతో సముద్రం లాంటి కాంగ్రెస్ లో ముందుకు దూసుకుని వచ్చారు.
By: Satya P | 4 Aug 2025 9:40 AM ISTతెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి అనేది తెలిసిందే. ఆయన తన వాక్చాతుర్యంతో సముద్రం లాంటి కాంగ్రెస్ లో ముందుకు దూసుకుని వచ్చారు. పీసీసీ చీఫ్ నుంచి సీఎం పోస్ట్ దాకా వచ్చారు. ఇక ఆయన వాగ్ధాటికి తెలంగాణా సమాజంలో మంచి పేరు ఉంది. అయితే జాతీయ స్థాయిలో కూడా తన ప్రసంగాలతో రేవంత్ రెడ్డి అలరిస్తున్నారు. అంతే కాదు ఆయన కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిలో కూడా పడుతున్నారు.
కాంగ్రెస్ నుంచి ఊహించని ఎటాక్ :
కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కానీ ఎవరి నోటా ఆ తరహా ఎటాక్ అయితే ఇప్పటిదాకా బీజేపీకి కానీ సంఘ్ కి కానీ ఎదురు కాలేదు. రేవంత్ రెడ్డి మాత్రం ఒకే ఒక్క మాటతో కాషాయ దళంతో పాటు మాతృ సంస్థలో చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే బీజేపీ సంఘ్ ఎప్పటికీ మోడీని ప్రధాని గద్దె నుంచి దించలేదని. ఆ పని చేయడంలో విఫలం చెందిందని. ఢిల్లీలో ఏఐసీసీ లీగల్ సెల్ సమావేశంలో రేవంత్ చేసిన దూకుడు స్పీచ్ ఇపుడు సంఘ్ తో పాటు బీజేపీలోనూ అతి పెద్ద చర్చకు దారి తీసింది.
మోడీ విషయంలో అంతా ఫెయిల్ :
నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు అప్పటి బీజేపీ ప్రధాని వాజ్ పేయ్ ప్రయత్నం చేసినా విఫలం అయిందని రేవంత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తుకు తెచ్చారు. ఇక తాజాగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయితే మోడీని దించే విషయంలో ఏమీ సాధించలేకపోతున్నారని ఎద్దేవా చెశారు. ఫలితంగా పాతికేళ్ళుగా మోడీ సీఎం గా ప్రధానిగా అధికారంలో ఉంటూ వస్తున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 75 ఏళ్ళ వయోపరిమితిని చూపించి తన సీనియర్లను పక్కన పెట్టిన మోడీని తప్పించే వారు ఎవరూ సంఘ్ లో కానీ బీజేపీలో కానీ లేరని రేవంత్ ఎద్దేవా చేశారు.
డైరీలో రాసి పెట్టుకోవాలి:
అయితే బీజేపీ సంఘ్ చేయలేని పనిని కాంగ్రెస్ 2029 ఎన్నికల్లో చేసి చూపిస్తుందని ఇది డైరీలో రాసి పెట్టుకోవాలని ఆయన ఢిల్లీ కాంగ్రెస్ వేదిక నుంచే జాతీయ బీజేపీ నేతలకు సవాల్ చేశారు. రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్ కి మాత్రమే మోడీని దించడం సాధ్యమని రేవంత్ రెడ్డి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 కంటే తక్కువ సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.
త్యాగాల పునాది కాంగ్రెస్ :
ఈ దేశానికి కాంగ్రెస్ ఎంతో చేసిందని రేవంత్ చెప్పారు. నాయకులు అంతా త్యాగాలు చేశారు అని ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని గుర్తు చేసి వారు దేశం కోసం బలి అయ్యారని చెప్పారు. బీసీల కోసం ఓబీసీల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం సామాజిక సమతూల్యతకు నిదర్శనం అన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ తో కలిసి అంతా నడుస్తున్నారని దేశంలో రానున్న రోజులలో ఇది గొప్ప మార్పుని తీసుకుని వస్తుందని రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సంఘ్ బీజేపీ శిబిరాలలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు.
