Begin typing your search above and press return to search.

అమాత్యుల మౌనం వెనక అంతర్యం ఏమిటి ?

అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి మద్దతుగా 14 మంది మంత్రులలో ఒక్కరు కూడా బయటకు వచ్చి మద్దతుగా మాట్లాడకపోవడం వెనక అంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

By:  Garuda Media   |   22 Aug 2026 10:57 AM IST
అమాత్యుల మౌనం వెనక అంతర్యం ఏమిటి ?
X

తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిల మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కారును కుదిపేస్తున్నాయి. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇవ్వగా, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు విధేయురాలినని, రేవంత్ రెడ్డి మీదనే తన పోరాటం అని కొండా సుష్మిత పునరుద్ఘాటించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని, ఆమెతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మీదా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి మద్దతుగా 14 మంది మంత్రులలో ఒక్కరు కూడా బయటకు వచ్చి మద్దతుగా మాట్లాడకపోవడం వెనక అంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఇంతేనా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో సొంతంగా 66 మంది సభ్యుల బలం ఉంది. కానీ నిన్నటి సమావేశానికి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యలు ఉన్నారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలు నాయక్, చిక్కుడు వంశీకృష్ణ, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె.ఆర్. నాగరాజు, రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, బి. లక్ష్మ రెడ్డి, వెడ్మ బొజ్జు, మందుల సామెల్ హాజరయ్యారు.

మరి మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు బయటకు రావడం లేదు ? వారంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా ? లేక నిశితంగా పరిణామాలను పరిశీలిస్తూ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం నడుచుకునేందుకు వేచి చూస్తున్నారా అన్న చర్చ జరుగుతుంది. అయితే నిన్నటి పరిణామాల నేపథ్యంలో సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్, పొంగులేటి మద్దతు దారులుగా ముద్రపడ్డ నల్లగొండ ఎమ్మెల్యేలు, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని అంటున్నారు.

ముఖ్యమంత్రి మీద ఇంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా ఒక్క మంత్రి కూడా నోరుమెదపకపోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో సుష్మిత ఆరోపణలు చేసినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

మరోవైపు కొండా సురేఖ బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావడం, వరంగల్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉండటంతో ఆమె మీద చర్యలు తీసుకునే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందని అంటున్నారు. దీంతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచన కూడా ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి రేపు లండన్ నుండి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ? కొండా సురేఖను తొలగిస్తారా ? లేక హెచ్చరించి వదిలేస్తారా ? అన్నది వేచిచూడాలి.