కేసీఆర్‌కు కౌంటర్: తెలంగాణ ఉద్యమం.. ప్రజా పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమాన్ని తానే చేశానని.. తానే లేకపోతే.. తెలంగాణ వచ్చి ఉండేది కాదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పే విషయం.
By: Garuda Media | 17 Sept 2025 3:47 PM ISTతెలంగాణ ఉద్యమాన్ని తానే చేశానని.. తానే లేకపోతే.. తెలంగాణ వచ్చి ఉండేది కాదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పే విషయం. అయితే.. ఆయన తరచుగా చేసే వ్యాఖ్యలకు.. `ప్రజాపాలన దినోత్సవం` పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం నిర్వహించిన.. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం అంటే.. ప్రజా పోరా టమన్న ఆయన, దీనిని ప్రజలే నిర్ణయించుకుని.. వారే పోరాడారని గతాన్ని గుర్తు చేశారు. తాజాగా పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రస్తావించారు. ఒక నియంతను పక్కన పెట్టిన చరిత్ర తెలంగాణ గడ్డ సొంతమని చెప్పారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి ఈ నేలపై చోటు లేదన్నారు. అందుకే.. నిన్నటి నియంత పాలనను ప్రజలు పక్కన పెట్టారంటూ.. కేసీఆర్ సర్కారు గద్దె దిగిపోయిన విధానంపై ఆయన స్పందించారు. ఎంతో మంది చేసిన త్యాగ ఫలంగా సంక్రమించిన తెలంగాణ రాష్ట్రంలో కొందరు పడి దోచుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన.. ఎవరికి ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో అలానే పెట్టారని అన్నారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటోందని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది.. తెలంగాణ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి చెప్పారు. పాలనను భూమార్గం పట్టించిన ఘనత కూడా.. కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు. ప్రజల మనసు తెలిసి వారికి అవసరమైన అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేశామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. త్వరలో `రాష్ట్ర విద్యా విధానం` తెస్తున్నామన్నారు.(ఇప్పటికే తమిళనాడులో వచ్చింది. మోడీ తెచ్చిన జాతీయ విద్యావిధానానికి కౌంటర్‌గా)
అదేసమయంలో ఉద్యోగాలు ఇస్తున్నామని.. ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన.. మరో 30 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళల కోసం డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మార్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందన్న రేవంత్ రెడ్డి.. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదన్నారు.
