ఎనిమిది నెలలు దారుణం...నీటి చుక్క దొరకదు...రేవంత్ హెచ్చరిక
ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి కూడా ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By: Satya P | 23 Oct 2026 11:30 PM ISTతీవ్ర దుర్భిక్ష పరిస్థితులు రానున్న ఎనిమిది నెలలు తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నిజం చెప్పేశారు. అంతే కాదు ఎండలు తీవ్రత అత్యంత దారుణంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రకృతి విపత్తులు. కరవుని విపత్తులను ఎవరూ ఆపలేరని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రజలు అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచిస్తూనే ఎల్ నినో విశ్వరూపం మీద ప్రజలకు కీలక హెచ్చరికలు జార్తీ చేశారు.
సాగు నీరు ఉండదు :
ఎల్ నినో ప్రభావంతో అధిక వేడిమి అంతటా వ్యాపిస్తుందని ఫలితంగా జనాలు ఆ ఎండల ధాటికి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేరని ఆయన చెప్పారు. అంతే కాదు రానున్న నాలుగైదు నెలల పాటు సాగుకు చుక్క నీరు కూడా దొరకదని రేవంత్ అలెర్ట్ చేశారు. ఇవన్నీ జనాలు గ్రహించినపుడే అప్రమత్తతతో బయటపడగలమని ఆయన అన్నారు. ఇక తాగడానికే నీళ్లు లేనపుడు వ్యవసాయానికి నీళ్ళు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ఉన్న నీరుని తాగడానికి వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎల్ నినో గురించి చెప్పడం అంటే అది క్యాన్సర్ లాంటి నిజం, అందువల్ల ముందే ప్రజలకు చెప్పడం మంచిది అని రేవంత్ రెండ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ని నమ్మితే :
ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి కూడా ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కరోనా టైమ్లో కేసీఆర్ ని నమ్మిన జనాలు శ్మశానానికి చేరారని విమర్శించారు. 2019 లో కరోనా వచ్చినపుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత లేకుండా వ్యవహరించారు అని ఆయన మండిపడ్డారు. తాను ఒక శాస్త్రవేత్త మాదిరిగా మాట్లాడారు అని విమర్శించారు. అయితే కేసీఆర్ మాటలను నమ్మిన వారు అంతా చివరికి శ్మశానానికి చేరారు అని రేవంత్ నిందించారు.
అప్రమత్తత బాధ్యత :
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వంటి వారు ప్రచారం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను గత ఆరు నెలలుగా కరవు పరిస్థితులు ఎల్ నినో గురించి జనాలను అప్రమత్తం చేస్తున్నాను అని ఆయన చెప్పారు. విపత్తుల సమయంలో ప్రజలను చైతన్యం చేయడం ప్రభుత్వాల బాధ్యత అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ఎల్ నినో విషయంలో సీరియస్ గానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
పొదుపు చర్యల గురించి :
ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘాన్ని వేసి క్లోజ్ మోనిటరింగ్ చేస్తోంది. అలాగే ప్రజలకు పొదుపు చర్యల గురించి అవగాహన పెంచుతోంది. విద్యుత్, నీరు వంటి వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచిస్తోంది. మొత్తానికి ఎల్ నినో పెను విపత్తు అంటూ తెలంగాణా పాలకులు చేస్తున్న హెచ్చరికలు అయితే జనంలో చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. మరి ప్రభుత్వం చేస్తున్న ఈ అప్రమత్త జనాలను ఏ మేరకు చైతన్యపరుస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
