రిలీజ్ సినిమా చూసేందుకు లారీలో వెళ్లే వాడిని.. సీఎం రేవంత్
సినిమాల మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పటివరకు తనకు సంబంధించి బయటపెట్టిన సరికొత్త విషయాన్ని వెల్లడించారు.
By: Garuda Media | 13 March 2026 10:50 AM ISTసినిమాల మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పటివరకు తనకు సంబంధించి బయటపెట్టిన సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాను సినిమాలకు ఎంత డైహార్ట్ ఫ్యాన్ అన్న సంగతిని తాజా ఉదాహరణతో చెప్పేశారు. తాను చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యాన్ గా చెప్పిన సీఎం రేవంత్.. తాను రిలీజ్ సినిమాలు చూసేందుకు ఎంతలా తిప్పలు పడేది చెప్పిన వైనం అందరిని ఆకర్షించేలా మారింది. కోకాపేటలో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీఫ్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా.. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. తన జీవితంలో సినిమాకు ఉన్న ప్రాధాన్యతను చెప్పుకొచ్చారు.
అప్పట్లో తాను సూపర్ స్టార్ క్రిష్ణ అభిమానినని.. ఏడాదిలో పదిహేను సినిమాల వరకు క్రిష్ణ నటించే సినిమాలు విడుదలయ్యేవన్నారు. వనపర్తిలో తాను చదువుకునే రోజుల్లో రిలీజ్ సినిమాలు కేవలం హైదరాబాద్, కర్నూలులో మాత్రమే విడుదలయ్యేవని.. దీంతో మొదటిరోజు సినిమా చూసేందుకు లారీలో వంద కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు వెళ్లేవాడినని చెప్పారు. సినిమాలు మధ్యతరగతి వాళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు.
తాను చిన్నప్పటి నుంచి సినిమా అభిమానినని.. సినీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పుల్ని గమనించినట్లు చెప్పారు. ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఆధునాతన సాంకేతికతతో సినిమా రూపొందించినా.. వాటిని ప్రదర్శించేందుకు సరైన థియేటర్లు లేకుంటే నిరుపయోగమవుతాయని చెప్పారు. తాను ఇంత పెద్ద థియేటర్ ను ఈ మధ్య కాలంలో చూడలేదన్న సీఎం రేవంత్.. తెలుగు సినీ నటులు అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారన్నారు.
హైదరాబాద్ లో ఇలాంటి థియేటర్ ను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్న సీఎం రేవంత్.. ‘ఈ డాల్బీ విజన్ కొత్త తరానికి సంబంధించిన సాంకేతికత. ఇప్పుడది హైదరాబాద్ కు వచ్చింది. వినోద రంగంలో నగరాన్ని ప్రత్యేకంగా నిలపాలని ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. అల్లు సినిమాస్ మల్టీఫ్లెక్స్ సంగతేమో కానీ..సినిమాలకు సీఎం రేవంత్ ఎంత వీరాభిమాని అన్న విషయం ఈ సందర్భంగా వెలుగు చూసిందని మాత్రం చెప్పక తప్పదు.
