హరీష్ కి షాక్...రేవంత్ బంపర్ ఆఫర్
బీఆర్ఎస్ కి గుండె కాయ లాంటి అసెంబ్లీ సీటు సిద్ధిపేట. 1985 నుంచి ఈ సీటు కేసీఆర్ కుటుంబానికి అంకితం అయింది.
By: Satya P | 22 March 2026 10:00 PM ISTబీఆర్ఎస్ కి గుండె కాయ లాంటి అసెంబ్లీ సీటు సిద్ధిపేట. 1985 నుంచి ఈ సీటు కేసీఆర్ కుటుంబానికి అంకితం అయింది. కేసీఆర్ టీడీపీ నుంచి నాలుగు సార్లు ఇదే సీటు నుంచి గెలిచి వచ్చారు. మంత్రి కూడా టీడీపీ జమానాలో అయ్యారు. ఉపసభాపతిగా కూడా చేశారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి బీఆర్ఎస్ తరఫున తొలిసారి గెలిచారు. ఇక 2004 నుంచి సిద్ధిపేట హరీష్ రావు సొంతం అయింది. ఆయన కూడా బీఆర్ఎస్ తరఫున అయిదు సార్లు ఇప్పటికి గెలిచారు వైఎస్సార్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రిగా చేసిన హరీష్ రావు, కేసీఆర్ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు.
నాలుగున్నర దశాబ్దాలుగా :
ఒక విధంగా చెప్పాలి అంటే సిద్ధిపేటలో కాంగ్రెస్ చివరి సారిగా గెలిచింది. 1983లో మాత్రమే. గత నాలుగున్నర దశాబ్దాలుగా కేసీఆర్ కుటుంబమే అక్కడ రాజ్యం చేస్తోంది. కేసీఅర్ హరీష్ రావు చెరో ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా చేశారు. ఇదిలా ఉంటే సిద్ధిపేట జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మాగారాన్ని ప్రారంభించారు. దానిని రైతులకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈసారి మార్చండి :
ఒకే కుటుంబానికి సిద్ధిపేట అనేక సార్లు అధికారం ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2028 ఎన్నికలో ఆ సంప్రదాయాన్ని మార్చాలని ఆయన ప్రజలను కోరారు. సిద్ధిపేట ప్రజలు తెలివైన వారు చైతన్యవంతులు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని తాము ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడాలని కోరారు. ప్రజలు మార్పుని స్వీకరించి ఈసారి ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.
గ్యారంటీగా మంత్రి :
ఈసారి సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కనుక గెలిస్తే ఆయనకు కచ్చితంగా తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సిద్ధిపేటను మరింతగా తాము అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. సిద్ధిపేట నుంచి ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికారం మారిందని కాంగ్రెస్ కి పగ్గాలు వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ సిద్ధిపేటలో కూడా ఆ మార్పు రావాల్సి ఉందని అన్నారు.
హరీష్ మీద కామెంట్స్ :
నర్మెట్టలో జరిగిన కార్యక్రమానికి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కాకపోవడాన్ని రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీకి చెందినా అభివృద్ధి విషయంలో ఒక్కటిగా ఉండాలని అలా కో ఆర్డినేట్ చేసుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. మెదకు ఎంపీగా ఉన్న బీజేపీ నేత రఘు నందన రావు తన మీటింగ్ కి హాజరు కావడాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇదే మంచి సంప్రదాయం అన్నారు. తాను మోడీకి స్వాగతం పలుకుతాను, తనకు రఘు నందన్ రావు స్వాగతం పలుకుతాడు అంటే ఇదంతా ప్రభుత్వ పరంగా జరిగే వ్యవహారం అన్నారు. రాజకీయాలు అన్నవి ఎన్నికల్లోనే మాట్లాడుకోవాలని అన్నారు. తాను రఘు నందన్ రావుని ఓడించడానికి ఎన్నో సార్లు సిద్ధిపేట వచ్చాను అని గుర్తు చేశారు. కానీ ఇపుడు తాను సీఎం ఆయన ఎంపీ ఇద్దరం ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వచ్చి సమస్యలు తన దృష్టికి తెస్తే ఎంతో బాగుండేది అని హరీష్ రావు గురించి వ్యాఖ్యానించారు.
ఫోకస్ సిద్ధిపేట :
మొత్తం మీద చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలిసారి సిద్ధిపేటలోకి అడుగు పెట్టారు, అంతే కాదు వేలాది మందితో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు, సిద్ధిపేటలో కాంగ్రెస్ ని గెలిపించాలని అన్నారు. ఒకే కుటుంబాన్ని నమ్ముకోవడం వల్ల మార్పు రాదని కూడా చెప్పారు. ఇవన్నీ చూసినపుడు టార్గెట్ హరీష్ రావు అన్నది అర్ధం అవుతోంది. ఇక చూస్తే రేవంత్ రెడ్డి స్పీచ్ కి సభలో మంచి స్పందన లభించింది అంతే కాదు 2028లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని ఆయన అన్నపుడు కూడా జనాలు పెద్ద ఎత్తున మద్దతుగా చప్పట్లు కొట్టడం విశేష పరిణామమే అంటున్నారు.
