రాహుల్ డిమాండ్ సరైందే: రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన డిమాండ్ సరైందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీ యువత కోసం రోడ్డెక్కారని తెలిపారు.
By: Garuda Media | 21 July 2026 10:32 PM ISTదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన డిమాండ్ సరైందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీ యువత కోసం రోడ్డెక్కారని తెలిపారు. ఆయనకు మద్దతుగా రాష్ట్రంలోనూ కార్యక్రమాలునిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు సాగుతోందని విమర్శించారు. పరీక్షల విషయంలో అనుసరిస్తున్న విధానాలు విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఆక్షేపించారు. నీట్ పరీక్ష పేపర్ లీకైతే.. ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదని సీఎం ఆరోపించారు..
ఇలాంటి సమయంలో విద్యార్థులకు అండగా రాహుల్‌గాంధీ నిరసన ప్రారంభించారని తెలిపారు. ఆయన చేపట్టిన నిరసనకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రధానిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా నిరసన వ్యక్తం చేసిన కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులపై లాటీ చార్జీ చేయడం దారుణమన్నారు. ఇలాంటివాటిని తాము ఉపేక్షించబోమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం సమంజసమేనని తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా కొనసాగింపు..
మరోవైపు దేశవ్యాప్తగా మంగళవారం కూడా నిరసనలు కొనసాగాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని పలు జిల్లాలు, ప్రధాన నగరాల్లో యువత పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అహ్మదాబాద్, గాంధీనగర్ వంటి కీలక నగరాల్లో వేలాది మంది రోడ్డెక్కారు. ఇక, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఛండీగడ్ వంటి రాష్ట్రాలలోనూ యువత నిరసనలు తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామాకు వారంతా పట్టుబట్టారు.
రాహుల్ దీక్ష భగ్నం
ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన నిరసపనను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో హింసాత్మకంగా మారడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైనే కూర్చుని ధర్నాను కొనసాగించారు.
