Begin typing your search above and press return to search.

మంత్రులకు హంగ్ పరీక్ష.. రేవంత్ కు 'పవర్' ఛాన్స్

కొన్ని సమస్యలకు కాలం మాత్రమే పరిష్కరిస్తుందని చెబుతారు. రాజకీయాల్లో అయితే ఈ మాటకు అర్థం ఇట్టే తెలుస్తుంది.

By:  Garuda Media   |   15 Feb 2026 12:00 PM IST
మంత్రులకు హంగ్ పరీక్ష.. రేవంత్ కు పవర్ ఛాన్స్
X

కొన్ని సమస్యలకు కాలం మాత్రమే పరిష్కరిస్తుందని చెబుతారు. రాజకీయాల్లో అయితే ఈ మాటకు అర్థం ఇట్టే తెలుస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలోని నేతలతో సమస్య ఏమంటే.. తమ స్థాయికి మించి తమను తాము ఊహించుకుంటారు. ఎక్కడిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీనే తీసుకోండి. రేవంత్ ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎక్కువ మంది తమను తాము ముఖ్యమంత్రితో సమానంగా ఊహించుకోవటం కనిపిస్తుంది. నిజానికి వారికి అంత సీన్ ఉందా? లేదా? అన్నది సామాన్యుడు సైతం ఇట్టే చెప్పేస్తారు. కానీ.. మంత్రులకు మాత్రం ఆ సోయి ఉండదు

తమను అధిష్ఠానం గుర్తించలేదు కానీ.. తమ సత్తా వేరే లెవల్ అన్నట్లుగా ఫీలయ్యే వారికి కాంగ్రెస్ లో కొదవ ఉండదు. ఈ కారణంతోనే.. అన్నీతానై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డిని.. ముఖ్యమంత్రిగా తమ మనసుల్లో అంగీకరించేందుకు చాలామంది మంత్రులకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఇప్పటికి ఆయన మంత్రివర్గంలోని కొందరు ఆయన్ను సీఎంగా అందరి ముందు అంగీకరించినా.. మనసుల్లో మాత్రం అంత సీన్ లేదన్నట్లుగా భావిస్తారు. అదే విషయాన్ని తమ సన్నిహితులతో జరిగే అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

ఇలాంటి వారందరికి తానేమిటన్నది నిరూపించుకునేందుకు రేవంత్ అస్సలు ప్రయత్నించరు. దాని కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం ఆయనకు తెలుసు. అందుకే తనదైన టైం కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండున్నరేళ్లలో (దగ్గర దగ్గర) గడిచిన మూడు నాలుగు నెలలుగా ఆయన మాటలో మార్పు కనిపిస్తోంది. అందుకు నిదర్శనంగా మూడు రోజుల ముందు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ఓపెన్ గా చెప్పేసుకునే వరకు వెళ్లారు. దీనికి కారణం పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ తాను సాధించిన పట్టును ఆయన ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ కు పార్టీలో తన పట్టును మరింత పెంచుకునే అవకాశాన్ని మున్సిపల్ ఎన్నికల రూపంలో వచ్చిందని చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 36 స్థానాల్లో హంగ్ నెలకొంది. అయితే.. వీటిల్లో పార్టీల కలయికతో కొలిక్కి వచ్చేస్థానాలు కొన్ని ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన బలం లేకుండా ఉన్న స్థానాలు 24 ఉన్నాయి. వీటిల్లో అత్యధికం కాంగ్రెస్ సొంతం కావాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన.

ఇందుకు తగ్గట్లే హంగ్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ వశం అయ్యేందుకు మంత్రులకు టార్గెట్ విధించారు సీఎం రేవంత్. తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని వివరించటంతో పాటు.. ఇదంతా కలిసికట్టుగా అందరం పని చేయటంతోనే సాధ్యమంటూఎన్నికల గెలుపు క్రెడిట్ ను అందరికి పంచారు ముఖ్యమంత్రి రేవంత్. అదే సమయంలో హంగ్ మున్సిపాలిటీలు.. వాటిని సాధించేందుకు మంత్రుల వారీగా టార్గెట్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పలువురు మంత్రులకు హంగ్ పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. సీఎం రేవంత్ తన పట్టును పెంచుకోవటానికి తగిన పరిస్థితులు ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిస్థితి. తాను పదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని తరచూ చెప్పే సీఎం రేవంత్ కోరుకున్నట్లే.. ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్నదిప్పుడు చర్చగా మారింది.