Begin typing your search above and press return to search.

కేసీఆర్ అందుకే స‌భ‌కు రావ‌ట్లేదు: నిప్పులు చెరిగిన రేవంత్‌

తాజాగా మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఎందుకు రావ‌డంలేద‌నే విష‌యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

By:  Garuda Media   |   30 March 2026 12:07 PM IST
కేసీఆర్ అందుకే స‌భ‌కు రావ‌ట్లేదు: నిప్పులు చెరిగిన రేవంత్‌
X

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఆదివారం సెగ‌లు పొగ‌లు క‌క్కాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి స‌హా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత‌.. మాజీ సీఎం కేసీఆర్ స‌భ‌కు రాక‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వాస్త‌వానికి కేసీఆర్ స‌భ‌కు రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న స‌భ‌కు రాకుండానే జీతం తీసుకుంటున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి వేత‌నాల్లో కోత పెట్టే వ్య‌వ‌స్థ ఉండాల‌ని కూడా ఇటీవ‌ల స‌భ‌లోనే వ్యాఖ్యానించారు.

తాజాగా మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఎందుకు రావ‌డంలేద‌నే విష‌యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ''ఒక ద‌ళితుడు(ప్ర‌సాద్ కుమార్‌) స్పీక‌ర్‌గా ఉండ‌డాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ద‌ళితుడి ముందు తాను కింద కూర్చోవాలంటే(పోడియం పైన ఎత్తులో ఉంటుంది) అవ‌మానక‌రంగా ఉంటుంద‌ని భావించే స‌భ‌కు రావ‌డం లేదు. ద‌ళితుల ఓట్లు కావాలి.. కానీ వారికి ఆత్మాభినం ఉంటుంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ గుర్తించ‌డం లేదు'' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. గ‌తంలో ద‌ళితుల‌ను సీఎం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. క‌నీసం.. వారిని త‌న గ‌డ‌ప కూడా తొక్క‌నివ్వ‌లేద‌న్నారు. కానీ, తాము అలాకాద‌ని.. ద‌ళితుల‌కు ప‌ద‌వులు ఇచ్చి గౌర‌విస్తున్నామ‌ని.. చెప్పారు. సీత‌క్క‌, భ‌ట్టి విక్ర‌మార్క స‌హా అనేక మందికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చామ‌ని చెప్పారు. ద‌ళితుల‌ను.. స‌మాజంలోని వెనుక బ‌డిన వ‌ర్గాల‌ను గౌర‌వించే పార్టీ కాంగ్రెస్ మాత్ర‌మేన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. జీతం తీసుకుంటూ కూడా స‌భ‌కు రాని కేసీఆర్ రాజీనామా ఎందుకు చేయ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.