కేసీఆర్‌ది గడీల పాలన.. : రేవంత్ వ్యాఖ్యల మర్మమేంటి?
బీఆర్ ఎస్ పాలనపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనను గడీల పాలనతో పోల్చారు.
By: Garuda Media | 5 Dec 2025 11:00 PM ISTబీఆర్ ఎస్ పాలనపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనను గడీల పాలనతో పోల్చారు. ఆయన హయాంలో గోస పెట్టని ప్రజలు లేరని విమర్శించారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలుచేశారు. రైతుల నుంచి సామాన్యుల వరకు అందరినీ కేసీఆర్ పాలనలో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్టేనని చెప్పారని, కానీ, తాము వచ్చాక.. వరి వేసిన రైతులను ప్రోత్సహించా మన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరలకే కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు.
బీఆర్ ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. తమ 20 నెలల పాలనలో లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆనాడు సీఎం కేసీఆర్ తీవ్ర దుష్ప్రచారం చేశారని, కానీ, అవన్నీ నమ్మ కుండా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పారు. ఫలితంగా ఇప్పుడు ఇందిరమ్మ పాలన చేరువైందని అన్నారు. రైతు బంధును నిలిపివేస్తారంటూ కాంగ్రెస్‌పై ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట నీటి మూటగా మారిందన్నారు. ఇప్పుడు రైతులకు అండగా ఉంటున్నామని.. వారికి రుణమాఫీ కూడా చేస్తున్నామని వివరించారు. 9 వేల కోట్ల రైతు బంధు ఇచ్చామన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదన్నారని..కానీ, పవర్‌లోకి వచ్చాక.. రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమ్ కట్ అయ్యిందని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్‌కు మాత్రమేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, వరంగల్‌కు ప్రత్యేకంగా కేసీఆర్ ఏమీ చేయలేదన్న రేవంత్ రెడ్డి.. నాటి పోరాట వీరులను రాజకీయంగా వాడుకుని వదిలేశారని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి ఏనాడూ ఇటుక కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక.. అనేక పనులు చేస్తున్నామన్నారు. తాజాగా 530 కోట్లరూపాయల విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నట్టు తెలిపారు.
ఎందుకిలా?
సాధారణ ఎన్నికలకు మరోరెండేళ్ల సమయం ఉండగానే.. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తరచుగా.. కేసీఆర్‌ను, బీఆర్ ఎస్ పాలనను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా నిప్పులు చెబుతున్నారు. దీనికి కారణం.. పంచాయతీ ఎన్నికలనేనని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో జెండాలు ఉండవు. అజెండాలుకూడా ఉండవు. అయినా.. పార్టీలకు సానుభూతి ఉంటుంది. దీనిని ఛిద్రంచేసి.. ప్రజలను కాంగ్రెస్ వైపు నడిపించాలన్న ఏకైక లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేసుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్ ఎస్ ఈ విషయాన్ని లైట్ తీసుకోవడం గమనార్హం.
