Begin typing your search above and press return to search.

కేటీఆర్ అరెస్ట్ అందుకే ఆగింది.. రేవంత్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు.

By:  A.N.Kumar   |   6 Nov 2025 10:35 AM IST
కేటీఆర్ అరెస్ట్ అందుకే ఆగింది.. రేవంత్ సంచలన కామెంట్స్
X

తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో అగ్గిరాజేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. అవినీతి మయమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిఫారసు చేసి, కేసు సీబీఐకి అప్పగించినప్పటికీ, మూడు నెలలు గడిచినా దర్యాప్తు ప్రారంభం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ఈ పరిణామాలన్నీ చూస్తే బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య సమన్వయం లేకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది?” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ , బీజేపీ మధ్య రాజకీయ ఒప్పందం ఉందన్న ఆరోపణలను మరింత బలపరిచేలా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్య చేసిన ఆయన, “ఈ విషయాన్ని గతంలో కవిత కూడా చెప్పింది. బీజేపీలో విలీన ప్రతిపాదనను తానే అడ్డుకున్నానని కవిత స్వయంగా చెప్పింది ” అని గుర్తుచేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరు పార్టీలు కలసి ‘రాజకీయ ప్రయోగం’ చేస్తున్నాయని ఆరోపిస్తూ, “ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్‌నే. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీలు, క్రైస్తవ వర్గాలు కూడా కాంగ్రెస్‌కు అండగా ఉన్నాయని తెలిపారు. “రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మైనారిటీలకు నమ్మకం ఇచ్చింది. వారంతా కాంగ్రెస్‌నే నమ్ముతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా వారి మద్దతు మనకే ఉంటుంది,” అని చెప్పారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి నాటకం ఆడుతున్నాయని, ప్రజలు ఆ నాటకాన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి “త్వరలో జరగనున్న పోలింగ్‌లో ప్రజలు ఇరుపార్టీలకు బుద్ధి చెబుతారు,” అని హితవు పలికారు.

కిషన్ రెడ్డి ప్రతిస్పందన

ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం దీనిపై విభిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్, కాంగ్రెస్ కవల పిల్లలే. అవి రెండూ కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

“కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఏర్పడ్డాక కుటుంబంతో కలిసి సోనియా గాంధీని కృతజ్ఞతలు తెలిపాడు. కాబట్టి, కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ల మధ్యే అవగాహన ఒప్పందం ఉంది,” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు తెలంగాణ రాజకీయ రంగాన్ని మరింత రసవత్తరంగా మార్చేశాయి.