సీతక్క మౌనం .. దేనికి సంకేతం ?
వీరందరూ ఒక ఎత్తైతే మంత్రి ధనసరి సీతక్క దీనిపై స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది.
By: Garuda Media | 23 Aug 2026 4:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్తితులను ఎదుర్కొంటున్నాడు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. విపక్షాల విమర్శల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలోని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత తీవ్రమైన ఆరోపణలు చేసింది. పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలో అన్నిస్థాయిల్లో కోట్లలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి తాను విద్యార్తిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మద్దతుగా గోడల మీద నినాదాలు రాశానని, అతను తన అభిమాన నాయకుడు అని తరచూ చెబుతుంటారు.
ఇప్పుడు ఆ చిన్నారెడ్డి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. ‘2023 ఎన్నికల్లో సోనియాగాంధీ తనకు పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, నా వద్ద డబ్బులు లేకున్నా రాష్ట్ర కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకు రావాలని ఆదేశాలు ఇచ్చిందని, కానీ తనకు వచ్చిన సీటును ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లింది.
రేవంత్ రెడ్డి మీద ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు మద్దతుగా మీడియా సమావేశం పెట్టి కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 66 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ బలం 17 మందేనా అన్న చర్చ రావడంతో శనివారం మరో 5 మంది ఎమ్మెల్యేలు గాంధీభవన్లో సమావేశం పెట్టి రేవంత్ కు మద్దతుగా మాట్లాడారు. కానీ ఒక్క మంత్రి కూడా బహిరంగంగా బయటకు వచ్చి గానీ, అంతర్గతంగా గానీ మాట్లాడిన దాఖలాలు లేవు.
వీరందరూ ఒక ఎత్తైతే మంత్రి ధనసరి సీతక్క దీనిపై స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. సీతక్క ఆలియాస్ ధనసరి అనసూయ, సీఎం రేవంత్ రెడ్డిలది అన్నాచెల్లెల్ల అనుబంధం. 2004లో టీడీపీలో చేరిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య చేతిలో ఓడిపోయింది. 2006లో జడ్పీటీసీగా, 2007లో టీడీపీ మద్దతుతో ఎమ్మెల్పీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాడు. 2009లో ములుగు నుండి సీతక్క, కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిలు మహాకూటమి తరపున పోటీ చేసి ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
అప్పటి నుండి వారి మధ్య వ్యక్తగత, బావోద్వేగ సంబంధాలు ఉన్నాయి. రేవంత్ తనను సోదరి లేదా సీతక్క అని సంబోధిస్తే, సీతక్క నా అన్న అని అంటుంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీతక్కను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించారు. ప్రతి రాఖీ పండగకు సీతక్క రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీ, రేవంత్ భార్య గీత సీతక్కకు బహుమతులు ఇవ్వడం, సీతక్క రేవంత్ రెడ్డి సతీమణికి చీరపెట్టడం, రేవంత్ రెడ్డి మనవడు రుద్రదేవ్ కు బహుమతులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
వీరిద్దరి మధ్య ఇంత అనుబంధం ఉన్నా కొండా సురేఖ కూతురు ఆరోపణల సమయంలో సీతక్క ఎందుకు స్పందించడం లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతకాలం నుండి రేవంత్ రెడ్డి, సీతక్కల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, మీడియా ప్రతినిదులతో ప్రైవేటు సంబాషణల్లో సీతక్క వ్యవహారశైలి మీద రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడన్న వార్తలు బయటకు పొక్కాయి. దాంతో పాటు సీతక్క ప్రత్యేకంగా పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లి కలిసిందన్న సమాచారం ఉంది. ఈ మేరకు అధిష్టానం ఆదేశాల మేరకే స్పందించాలని సీతక్క భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి త్వరలోనే రాఖీ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి - సీతక్కల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్న విషయంలో అందరికీ ఒక క్లారిటీ వస్తుందని భావించవచ్చు.
