Begin typing your search above and press return to search.

బీసీ రిజ‌ర్వేష‌న్‌: రేవంత్‌ వ్ర‌తం.. ఫ‌లితం రెండూ విఫ‌లం!

``స్థానిక ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాం.`` - హైద‌రాబాద్ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది.

By:  Garuda Media   |   29 Sept 2025 10:00 PM IST
బీసీ రిజ‌ర్వేష‌న్‌:  రేవంత్‌ వ్ర‌తం.. ఫ‌లితం రెండూ విఫ‌లం!
X

``స్థానిక ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాం.`` - హైద‌రాబాద్ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. ``బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే బిల్లును ఈ నెల‌లోనే ఆమోదించేలా చేస్తాం`` ఢిల్లీలో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన విష‌యం. ఆ త‌ర్వాత‌.. కూడా సీఎం ప‌లు సంద‌ర్భాల్లో ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి స‌ర్కారు రాగానే సుమారు 70 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి కుల గ‌ణ‌న చేయించారు. దీనిలో బీసీలు 42 శాతం మంది ఉన్నార‌ని లెక్క‌తేలింది.

దీంతో అప్ప‌టి నుంచి బీసీల‌కు పూర్తిగా 42 శాతం రిజ‌ర్వ‌ష‌న్లు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. దీనిని అన్ని పార్టీలు స్వాగ‌తించినా.. రాజ్యాంగం ప్ర‌కారం.. సుప్రీంకోర్టు తీర్పుల ప్ర‌కారం.. రిజ‌ర్వేష‌న్లు 50 శాతానికి మించి ఉండ‌డానికి వీల్లేదు. ఇదే ప్ర‌ధాన అడ్డంకిగా మారింది. అంటే.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స‌హా.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని.. 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌డానికి వీల్లేదు. తాజాగా ప్ర‌తిపాద‌న ప్ర‌కారం.. 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఒక్క బీసీల‌కే ఇచ్చేస్తే.. అప్పుడు రిజ‌ర్వేష‌న్లు 56 శాతానికి చేరుతున్నాయి. ఇదే పెను వివాదంగా మారింది.

దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు రేవంత్ రెడ్డి స‌ర్కారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. బిల్లును స‌భ‌లో ఆమోదించ‌డం తోపాటు హుటాహుటిన గ‌వ‌ర్న‌ర్‌కు, రాష్ట్ర‌ప‌తికి కూడా పంపించారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం.. ఢిల్లీలో నిర‌స‌న కూడా చేశారు. అయినా.. ఎక్క‌డా ఫలితం రాలేదు. మ‌రోవైపు.. స్థానిక స‌మ‌రం స‌మ‌యం ముంచుకు వ‌చ్చింది. దీంతో హుటాహుటిన గ‌త శుక్ర‌వారం జీవో ఇచ్చారు. అయితే.. దీనిని స‌వాల్ చేస్తూ.. మ‌ల్కాజిగిరి జిల్లాకు చెందిన వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఇది విచార‌ణ ద‌శ‌లో ఉంది. అంటే.. అటు గ‌వ‌ర్న‌ర్‌, ఇటు రాష్ట్ర‌ప‌తి, మ‌రోవైపు హైకోర్టు..రూపంలో బిల్లు ముందుకు ప‌డని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే సోమ‌వారం అనూహ్యంగా నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. దీంతో ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చినందున రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌ను మార్పు చేయ‌డానికి వీల్లేదు. గ‌తంలో ఉన్న‌ట్టుగానే 32 శాతం రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తారు. ఈ ప్ర‌భావం కాంగ్రెస్‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలుచెబుతున్నాయి. బీఆర్ ఎస్ నాయ‌కులు ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌భుత్వం బీసీల క‌ళ్లు గ‌ప్పే ప్ర‌య‌త్నం చేసింద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ప్ర‌భుత్వం మాత్రం తాము అమ‌లు చేయాల‌ని అనుకున్నామ‌ని, చిక్కులు వ‌చ్చాయ‌ని చెబుతోంది. ఏదేమైనా.. రేవంత్ రెడ్డి బీసీమంత్రం.. ఫ‌లించ‌లేదు. వ్ర‌తం.. ఫ‌లితం .. రెండూ చెడ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.