దేవుళ్లనే విడదీస్తారా...ఏంటీ నాన్సెన్స్ ?
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల గురించి మాట్లాడిన మాటలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.
By: Satya P | 30 Sept 2026 8:35 PM ISTకాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల గురించి మాట్లాడిన మాటలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. దేవుళ్ళు ఉత్తరాది దక్షిణాది అని తేడా చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యానం వైరల్ అవుతోంది. ఇక బీజేపీ అయితే రేవంత్ రెడ్డిని ఇదే విషయం మీద గట్టిగానే టార్గెట్ చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవుళ్ళకు విభజన ఏంటి అని విరుచుకుపడ్డారు. ఇపుడు బీఆర్ఎస్ వంతు అన్నట్లుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి తీరుని తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూంటే దేవుళ్ళను కూడా విడదీస్తారా అని ఏమిటీ నాన్సెన్స్ అని హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీతో పాటుగానే :
ఈ దేశాన్ని బీజేపీ హిందూ ముస్లిం అంటూ విభజన చేయాలని చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇపుడు ఆ పార్టీకి ఏమీ తక్కువ తినలేదు అన్నట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దేవుళ్ళను విడదీస్తూ మాట్లాడం ఏంటి అని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అజెండా ఇదేనా అని కూడా ఆయన నిలదీశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉపాధి గురించి, యువతకు ఉద్యోగాల గురించి చర్చించరా అని ఆయన ప్రశ్నించారు. అలాగే 2022లోగా దేశంలో ప్రతీ ఇంటికీ తాగు నీరు అన్నారు, $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఇదే విధంగా కేంద్రాన్ని నిలదీయాల్సి ఉండగా ఈ దేవుళ్ల ప్రస్తావన మధ్యలో ఎందుకు అని ఆయన మండిపడ్డారు.
అవసరమా :
నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ హిందూ వాదాన్ని తప్పుపడుతూ విమర్శించాలని అనుకున్నారు అంటున్నారు. అదే సమయంలో ఆయన రాముడు ఉత్తరాది శివుడు దక్షిణాది అని అలాగే ఆర్యులు ద్రావిడులు అని పేద దేవుడు ధనిక దేవుడు అని తేడాలు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు అయితే కొంత వివాదాన్నే రాజేశాయని అంటున్నారు. హిందూ మత విశ్వాసాలు చూస్తే చెట్టుకు పుట్టకు గుట్టకు కూడా దండం పెడతారు, తారతమ్యాలు ఏవీ అక్కడ ఉండవు, అందరూ మన వాళ్ళే అనుకుంటారు, అలాంటిది దేవుళ్ళ మధ్య విభజన తేవడం అంటే ఆస్తిక జనలు అయితే కొంత సహించలేని విధంగానే ఉంది అని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ డబ్బున్న వారి పార్టీ అని డబ్బున్న దేవుడు పార్టీ అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినా అవి విపక్షాలు ఆయుధంగా మారాయని అంటున్నారు.
సున్నితమైన అంశాలు :
నిజానికి మతం అన్నది వ్యక్తిగతం. రాజకీయాల్లోకి జొప్పించడం అన్నది కూడా అనవసరం. కానీ కాదేదీ అనర్హం అన్నట్లుగా ఈ దేశంలో మత రాజకీయం చాప కింద నీరుగా సాగిపోతోంది. అయితే బీజేపీ తీరుని ఎండగట్టే క్రమంలో కాంగ్రెస్ కూడా అందులోకి ఆకర్షించబడుతోంది అన్న చర్చ సాగుతోంది. ఈ దేశంలో శ్రీరామనవమి ప్రతీ ఇంట వేడుకగా ఎంతగా నిర్వహిస్తారో మహా శివరాత్రి అంతే నిబద్దతతో నిర్వహిస్తారు. అలాంటిది రాముడు శివుడు అని భేదా భావాన్ని సృష్టించేలా చేయడం ద్వారా కాంగ్రెస్ కార్నర్ అవుతోంది అంటున్నారు. అందుకే సరిగ్గా కాంగ్రెస్ ఎక్కడ దొరుకుతుందో చూసి అక్కడే బీఆర్ఎస్ తన బాణాలను ఎక్కుపెట్టింది అని అంటున్నారు. మరి దీని మీద కాంగ్రెస్ మరింత వివరణ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
