Begin typing your search above and press return to search.

అవార్డు స‌రే.. సీఎంగా రేవంత్ 'గ్రాఫ్' ఎలా ఉంది?

ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలో రేవంత్‌పై సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

By:  Garuda Media   |   28 Sept 2026 5:00 PM IST
అవార్డు స‌రే.. సీఎంగా రేవంత్ గ్రాఫ్ ఎలా ఉంది?
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. తాజాగా కేర‌ళ‌కు చెందిన `ఆర్య‌దాన్‌` సంస్థ‌.. `ప‌బ్లిక్ స‌ర్వెంట్‌-2026` అవా ర్డును ప్ర‌దానం చేసింది. ప్ర‌భుత్వ పాలన, ప్రజాసేవలో చూపిస్తున్న చొరవకు గానూ ఆయనకు ఈ అవార్డును అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా చేసిన కేసీఆర్‌కు కూడా ఈ అవార్డు రాలేదు. కేవ‌లం రెండున్న‌రేళ్ల పాల‌న‌లోనే రేవంత్ రెడ్డి సుప‌రిపాలన విష‌యంలో మంచి మార్కులు వేయించుకున్న‌ట్టుగా అవార్డు స్ప‌ష్టం చేస్తోంది.

స‌రే.. అవార్డుల మాట ఎలా ఉన్నా.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజంలో ఉన్న గ్రాఫ్ ఎలా ఉంది? వారు వేస్తున్న మార్కులు ఎలా ఉన్నాయ‌న్న‌దిప్ర‌ధానం. ఎందుకంటే.. రేపు మ‌రోసారి ఓటు వేయాల్సింది.. వారే!. గెలిపించాల్సింది కూడా.. తెలంగాణ స‌మాజ‌మే. ఈ ప‌రంగా చూసుకుంటే.. రేవంత్ రెడ్డికి.. మాస్ ఫాలోయింగ్ ఉన్నా.. క్లాస్‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలో రేవంత్‌పై సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

ప్ర‌భావం చూపుతున్న అంశాలు..

1) భూముల ధ‌రలు పెర‌గడం.. ఇంటి అద్దెలు పెంచుకునేలా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం.

2) రాజ‌కీయంగా దూకుడు ఉన్నా.. పాల‌న ప‌రంగా.. దూకుడు త‌గ్గింద‌న్న‌వాద‌న‌.

3) ప్ర‌తి విష‌యానికీ ఢిల్లీకి ప‌రుగులు పెట్ట‌డం.

4) శాఖ‌ల‌పై ప‌ట్టు త‌గ్గ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచాల సంస్కృతి పెచ్చ‌రిల్ల‌డం.

ఇక‌, మాస్ విస‌యానికి వ‌స్తే..

మాస్ జ‌నాల్లో రేవంత్‌రెడ్డికి ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. ఓటు బ్యాంకు రూపంలో కొంత వెనుకంజ వేసే ప‌రిస్థితి క‌నిపి స్తోంద‌ని అంటున్నారు. ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నా.. అంద‌రికీ రాక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ము ఖ్యంగా బీసీలు 44 శాతం మంది ఉన్నార‌ని చెబుతున్నా.. వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే దిశ‌గా వ్య‌వ‌హ‌రిం చక‌పోవ‌డం. కేవ‌లం త‌న వాగ్ధాటితోనే రాజ‌కీయాలు చేయ‌డం వినేందుకు బాగున్నా.. ఇది ఫ‌లిస్తుందా? అనేది కూడా మాస్‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

కేసీఆర్‌ను తిట్టి..

మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్ట‌డం ద్వారా.. రాజ‌కీయంగా పైచేయి సాధించాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఇది విక‌టిస్తోంది. ఒక‌సారి అంటే.. ఓకే.. రెండు సార్లు అంటే ఒకే.. కానీ, ప‌దే ప‌దే కేసీఆర్‌ను కార్న‌ర్ చేస్తూ.. వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని మెజారిటీ తెలంగాణ స‌మాజం జీర్ణించుకోలేక పోతోంది. పైగా సానుభూతి పెరిగే అవ‌కాశం కూడా ఏర్ప‌డుతోంది. ఎన్ని లోపాలు ఉన్నా.. కేసీఆర్‌ను తెలంగాణ స‌మాజం వేరు చేసి చూసే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలోనే.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల‌ను త‌గ్గించాల‌న్న సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి.

పార్టీపై ప‌ట్టు..

పార్టీపై త‌న‌కు పూర్తిస్థాయిలో ప‌ట్టుంద‌ని రేవంత్‌రెడ్డి చెబుతున్నా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పెరుగుతున్న వివాదాలు వంటివి చూస్తే.. ఆయ‌న ప‌ట్టు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. సో.. మొత్తంగా రేవంత్ రెడ్డి విష‌యంలో ఫిఫ్టీ : ఫిఫ్టీ.. అన్న‌మాటే వినిపిస్తుండడం గ‌మ‌నార్హం.