Begin typing your search above and press return to search.

జెన్ జెడ్ కి రాజకీయాల్లో ఛాన్స్.. ఎన్నికల్లో పోటీ వయసు తగ్గించాలని రేవంత్ ప్రతిపాదన

భారత రాజకీయాల్లో యువత భాగస్వామ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపింది.

By:  A.N.Kumar   |   28 July 2026 9:08 AM IST
జెన్ జెడ్ కి రాజకీయాల్లో ఛాన్స్.. ఎన్నికల్లో పోటీ వయసు తగ్గించాలని రేవంత్ ప్రతిపాదన
X

భారత రాజకీయాల్లో యువత భాగస్వామ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపింది. డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న ‘జెన్-జెడ్’ యువతను కేవలం ధర్నాలు, రాజకీయ ర్యాలీలకే పరిమితం చేయకుండా... నేరుగా నిర్ణయాధికారం ఉండే చట్టసభల్లోకి తీసుకురావాలని ఆయన గళమెత్తారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును తగ్గించాలని సంచలన ప్రతిపాదన చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రతిపాదన దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును తగ్గించాలని ఆయన సూచించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యువతను కేవలం ఆందోళనలకు పరిమితం చేయకుండా నేరుగా చట్టసభల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

శనివారం నిర్వహించిన క్యాండిల్‌లైట్ ర్యాలీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా తన ప్రతిపాదనను మరింత వివరించారు. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభ, రాష్ట్ర శాసన మండళ్లకు 30 సంవత్సరాలు ఉండాలి. రేవంత్ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే వయసును 25 నుంచి 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసన మండళ్లకు 30 నుంచి 25 సంవత్సరాలకు తగ్గించాలని సూచించారు.

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇరవై ఏళ్ల వయసులోనే యువ నాయకులు కీలక పదవులు చేపట్టారని, భారత యువతకు కూడా అలాంటి అవకాశాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విధానాల రూపకల్పనలో యువత ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.

యువతను కేవలం నిరసనలు, ఉద్యమాలకే పరిమితం చేయకుండా శాసనసభల్లోకి తీసుకువస్తే పాలనలో కొత్త ఆలోచనలు, సాంకేతిక అవగాహన, ఆధునిక దృక్పథం పెరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన నాయకులతో పాటు యువత కూడా ఉంటే చట్టసభల్లో సమతుల్యత ఏర్పడుతుందని.. ప్రజా సమస్యలపై కొత్త కోణంలో చర్చ జరిగే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన రాజ్యాంగ సవరణలను కూడా ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారని చెప్పారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించారని గుర్తు చేశారు. ఆ మార్పుల వల్లే 21 ఏళ్ల వయసులోనే తిరువనంతపురం మేయర్‌గా ఒక మహిళ ఎన్నికయ్యే అవకాశం లభించిందని ఉదాహరణగా చెప్పారు.

భారత్ జనాభాలో దాదాపు 30 శాతం మంది జెన్ జెడ్ యువత ఉన్నప్పటికీ 543 మంది సభ్యులున్న లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం ఒక శాతానికి కూడా చేరలేదని రేవంత్ పేర్కొన్నారు. అదే సమయంలో 21 ఏళ్ల వయసులోనే యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సివిల్ సర్వీసుల్లో చేరేందుకు అర్హత పొందుతుంటే అదే వయసులో పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేరని ప్రశ్నించారు.

విద్య, సమాచార సాంకేతికత, స్టార్టప్‌లు, డిజిటల్ ఎకానమీ వంటి యువతకు సంబంధించిన రంగాల్లో యువ శాసనసభ్యుల భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతుదారులు దీనివల్ల భారత ప్రజాస్వామ్యం మరింత ఆధునికంగా మారుతుందని.. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశం వస్తుందని అంటున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం పాలనా అనుభవం, రాజకీయ పరిపక్వత వంటి అంశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ప్రతిపాదన అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.