రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండి: రేవంత్ సంచలన కామెంట్లు
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చెప్పండి.. అంటూ ప్రశ్నించడం.. తీవ్ర సంచలనంగా మారింది.
By: Garuda Media | 7 Nov 2025 9:38 PM ISTజూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చెప్పండి.. అంటూ ప్రశ్నించడం.. తీవ్ర సంచలనంగా మారింది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ, వ్యయాల జాబితాలను కూడా కుండబద్దలు కొట్టారు. తమకు నెలకు కేవలం 5 వేల కోట్ల రూపాయలే మిగులుతున్నాయని.. అందరినీ సమన్వయం చేస్తు న్నామని చెప్పిన ఆయన... ఈ 5 వేల కోట్ల రూపాయలతో పాలన ఎలా చేయాలో మీరే చెప్పండి.. అంటూ ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి నిప్పులు చెరిగారు.
విషయం ఏంటి?
తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థలు.. గత కొన్నాళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిం దే. గత కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన బకాయిలతోపాటు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు నిధులు ఇవ్వడంలేదని యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. శుక్రవారం అన్ని కళాశాలలు బంద్ చేపట్టాయి. మరోవైపు.. బకాయిలు ఇస్తే తప్ప.. తమ బంద్‌ను విరమించేది లేదని కూడా తేల్చి చెప్పాయి. ఇంకోవైపు.. న్యాయ పోరాటానికి కూడా దిగాయి. హైకోర్టులో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల వివాదంపై కాలేజీల యాజమాన్యాలు పిటిషన్లు వేశాయి.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో స్పందించారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఆయన .. ``డబ్బులు ఇప్పుడు కాకపోతే.. రేపు ఇస్తాం. కానీ, విద్యార్థుల అమూల్యమైన సమయాన్ని బంద్ పేరుతో మూసి వేస్తున్న మీరు.. ఆ సమయాన్ని తిరిగి ఇవ్వగలరా?`` అని నిలదీశారు. విద్యార్థులు సహా వారిజీవితాలతో ఆటలు ఆడుకోవద్దన్నారు. ఇదేసమయంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వ్యయాలను ఆయన లెక్కలతో సహా వివరించారు. రాష్ట్రానికి నెలకు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్న సీఎం.. దీనిలో 13 వేల కోట్లు.. ఉద్యోగుల జీతాలకు, పింఛన్లకు, వడ్డీలకు.. ఇస్తున్నామన్నారు.
ఇక, ప్రభుత్వానికి మిగిలేది కేవలం 5 వేల కోట్ల రూపాయలేనని రేవంత్ రెడ్డిచెప్పారు. ఇంత స్వల్ప ఆదాయంతో ప్రభుత్వాన్ని ముందుకు ఎలా నడిపించాలో చెప్పాలన్నారు. అయితే.. అదేసమయంలో రాష్ట్రానికి డబ్బుల సమస్య లేదని చెప్పారు. ఇక, కాలేజీ యాజమాన్యాలు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాయా అని నిలదీశారు. కాలేజీలను బంద్ చేయించినవారితో చర్చించడానికి ఏమీ మిగల్లేదని తేల్చి చెప్పారు. ఇక, ఈ క్రమంలోనే అడ్డగోలుగా ఫీజులు పెంచేశారని, తర్వాత.. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం పట్టుబడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఫీజులు పెంచి.. విద్యను వ్యాపారం చేస్తారా? అని నిలదీశారు.
మీరు వస్తారా?
ఈ సందర్భంగా బీసీ జాతీయ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మాదిగ పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్) నేత మంద కృష్ణమాదిగలకు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ రువ్వారు. ``మీరు వారిని వెనుకేసుకు వస్తున్నారు. అలాకాదు.. మీరు ముందుకు రండి. కాలేజీలు ఎంత అడ్డగోలుగా దోచుకుంటున్నాయో.. చిట్టా చూపిస్తా. ఎంత అక్రమంగా కాలేజీలను ఏర్పాటు చేశారో చెబుతా`` అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ వ్యవహారం.. తీవ్రంగా మారే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో చూడాలి.
