రిటైర్మెంట్ ని ముందే ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి
రాజకీయం అనే వృత్తిలో ఉన్న వారు పదవీ విరమణ అన్న పదానికి బహు దూరంగా ఉంటారు.
By: Satya P | 18 Aug 2025 12:25 PM ISTరాజకీయం అనే వృత్తిలో ఉన్న వారు పదవీ విరమణ అన్న పదానికి బహు దూరంగా ఉంటారు. ఈ మధ్యనే రాష్ట్రీయ స్వయం సంఘ్ అధినేత మోహన్ భగవత్ కూడా 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల్లోకి హుందాగా తప్పుకోవాలని సూచించారు. అయితే ఇవి రాజకీయ జీవులకు పెద్దగా రుచించే మాటలు కావని అందరికీ తెలుసు. కొద్ది మంది మాత్రమే రాజకీయ విరమణ గురించి చెబుతారు. అలా చెప్పిన వారు కూడా మాట నిలబెట్టుకునేది కూడా ఇంకా తక్కువ. అసలు ఏ వృత్తికి అయినా రిటైర్మెంట్ ఉంది కానీ రాజకీయాలకు లేదని కూడా చెప్పుకోవడం పరిపాటి.
మరో పదిహేనేళ్ళేనట:
అయితే చిత్రంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను 2040 నాటికి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని ప్రకటించారు. ఇపుడు చూస్తే 2025 నడుస్తోంది. అంటే గట్టిగా పదిహేనేళ్ళు మాత్రమే ఉంది. అప్పటిదాకా తాను రాజకీయాల్లో ఉంటాను అని ఆయన అంటున్నారు. తెలంగాణాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ప్రకటన రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. కొత్త చర్చకు దారి తీస్తోంది. చాలా మంది దీని మీద ఆలోచిస్తున్నారు.
సీఎం గా మరోసారి :
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి తానే 2028లో గెలిచి మరోసారి సీఎం గా ఉంటాను అని చెప్పారు. అంతే కాదు 2034 దాకా తానే సీఎం అన్నట్లుగా కూడా ఆయన ఇంకో సందర్భంలో మాట్లాడారని ప్రచారంలో ఉంది. ఈ లెక్కన ఆయన మూడు సార్లు సీఎం గా ఉంటారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ లోనూ బయటా సాగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతీ అయిదేళ్ళలో అయిదుగురు సీఎంలు అన్నది ఒక ఆనవాయితీగా ఉంటూ వచ్చేది. అయితే గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కూడా ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయని సర్దుకుంది ఒకరినే సీఎం గా అయిదేళ్ళూ కొనసాగిస్తోంది అలా రేవంత్ రెడ్డికి 2028 దాకా సీఎం పదవికి ఢోకా లేకపోవచ్చు కానీ ఆ తర్వాత 2028లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచినా ఆయనకు చాన్స్ ఉంటుందా అన్నదే మరో చర్చ.
అవగాహనతోనే చెప్పారా :
అయితే ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియనివి కావు అని అంటున్నారు. ఆయన రాజకీయంగా రాటు తేలిన వారే. వ్యూహాలు గట్టిగా ఉన్న వారే. రేపు ఏమి జరుగుతుందో అంచనా వేయగలిగే వారే. ఇక చూస్తే రేవంత్ రెడ్డి వయసు ఇపుడు అయిదున్నర పదులు దాటింది. రాజకీయంగా చూస్తే ఆయన యంగ్ లీడర్ గానే చూడాల్సి ఉంటుంది. ఇదే తీరున మరో ఇరవై ఏళ్ళ పాటు రాజకీయం చేయగలను అని కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. ఒక వేళ సీఎం కాకపోయినా ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళగలరు. అలాగే మరేదైనా కీలక పదవిలో ఉండగలరు.
అలా ఆయన తన రాజకీయ జీవితాన్ని 15 ఏళ్ళ పాటు కొనసాగించగలరు అని అంటున్నారు. ఇక క్రియాశీల రాజకీయాల్లో అని కూడా ఆయన అన్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేయడమే అని అంటున్నారు. మరో నాలుగు సార్లు అసెంబ్లీకి పార్లమెంట్ కి ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. అలా ఆయన రాజకీయ జీవితంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తాను అనుకున్న స్థానాలను అందుకోవడం ద్వారా సంతృప్తికరమైన రాజకీయ జీవితంతోనే రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నారులా ఉంది ఇక ఆర్ఎస్ఎస్ ఈ మధ్య చెప్పిన 75 ఏళ్ళకే పదవీ విరమణ రేవంత్ రెడ్డికి స్పూరిగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి తన రిటైర్మెంట్ ముందే ఫిక్స్ చేసిన అరుదైన నేతగా ఆయన నిలిచారు అని మాత్రం చెప్పవచ్చు.
