భగీరథ్‌ను పోలీసులే పట్టుకున్నారు: రేవంత్ క్లారిటీ
అయితే.. పోలీసులు అరెస్టు చేసే సమయంలో భగీరథ్ తండ్రి ఉన్నాడా.. లేడా.. అనే విషయాలు ఆయనకే తెలియాలని సీఎం వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 21 May 2026 10:33 PM ISTబాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బండి భగీరథ్‌ను ఆయన తండ్రి స్వయంగా పోలీసులకు అప్పగించారా? లేక.. పోలీసులే.. బండి భగీరథ్‌ను పట్టుకుని అరెస్టు చేశారా? అనే సందేహంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పోలీసు అధికారులు నమోదు చేసిన వివరాలు.. కోర్టు సమ్మతించిన వివరాల ప్రకారం.. పోలీసులే.. భగీరథ్‌ను రోడ్డు కూడలిలో ఉండగా అరెస్టు చేశారని చెప్పారు. దీనిని బట్టి పోలీసులే ఆయనను అరెస్టు చేశారని స్పష్టం చేశారు.
అయితే.. పోలీసులు అరెస్టు చేసే సమయంలో భగీరథ్ తండ్రి ఉన్నాడా.. లేడా.. అనే విషయాలు ఆయనకే తెలియాలని సీఎం వ్యాఖ్యానించారు.ఐదు రోజుల పాటు పోలీసుల కళ్లు గప్పి తండ్రి, తనయులు ఒకే ఇంట్లో ఉన్నారో.. లేక ఎక్కడైనా ఉన్నారో కూడా తనకు తెలియదన్నారు. తాము బీఆర్ ఎస్ నాయకుల మాదిరిగా.. మాట్లాడలేమన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. విచారణ అధికారిగా వ్యవహరిస్తే.. కేసీఆర్.. జడ్జి పాత్ర పోషించి.. శిక్ష కూడా ఖరారు చేశారని ఎద్దేవా చేశారు.
అయితే.. తమది ఒక ప్రభుత్వమని.. దానికి కొన్ని చట్టాలు.. విధానం, పద్ధతి వంటివి ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు. దాని ప్రకారమే తాము వ్యవహరించామని.. దీనిని కోర్టు కూడా అంగీకరించిందన్నారు. పొక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ ఐఆర్ కట్టాలని, 24 గంటల్లో బాధితురాలి స్టేట్‌మెంటును రికార్డు చేయాలని.. తాము అదే పనిచేశామన్నారు. ఎక్కడా ఎవరినీ దాచే ప్రయత్నం.. సహకరించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. వాళ్ల(బీఆర్ ఎస్) లాగా.. తాము మాట్లాడలేమన్నారు.
రాజకీయాలు కావాలంటే.. ఎన్నికల సమయంలో కొట్లాడాలని బీఆర్ ఎస్ నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఒక విధానంలో చర్యలు తీసుకుంటోందన్నారు. మైనర్ బాలికను అడ్డు పెట్టుకుని రాజకీయా లు చేయడం శాడిజమని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే.. బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదేసమయంలో ఆయా ఘటనలను పట్టించుకోని అధికారులపైనా చర్యలు తీసు కుంటున్నట్టు తెలిపారు. బీఆర్ ఎస్ నాయకుల వల్ల.. ఆర్గనైజ్డ్ క్రైం జరుగుతోందన్నారు.
మీరేం చేశారు?
కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పట్టుబడితే.. కేటీఆర్ ఎందుకు ఖండించలేదన్నారు. ఇంకో మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్ ఘటనలో పోలీసుల పై కాల్పులు జరిగిన విషయాన్ని ఎందుకు ఖండించలేదన్నారు. పైగా సమర్థించారని తెలిపారు. అంతే కాదు.. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కోళ్ల పందేలు ఆడుతూ చిక్కారని.. విదేశాల్లోనూ ఓ వ్యాపారిపై కాల్పులు జరిగిన ట్టు తెలిసినా ఎందుకు ఖండించలేదన్నారు. కనీసం వారిని పార్టీనుంచి సస్పెండ్ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు.
