ప్లాస్టిక్ నిషేధంపై సీఎం సమావేశం... ట్రోల్స్‌కు కారణమైంది?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్లాస్టిక్ నిషేధం’ సమీక్షా సమావేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: A.N.Kumar | 1 Jan 2026 12:49 PM ISTఅనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటిలా తయారైంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్లాస్టిక్ నిషేధం’ సమీక్షా సమావేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు దక్కాల్సింది పోయి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా కోర్ హైదరాబాద్ నగర ప్రధాన ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని.. పర్యావరణాన్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక మార్గదర్శకాలపై చర్చించారు. అయితే ఈ సమావేశం ఆశయం బాగున్నా.. అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టకు విమర్శల సెగ తగిలేలా చేసింది.
ట్రోల్స్ కు కారణం ఏమిటి?
సాధారణంగా ఏదైనా మార్పు సమాజంలో రావాలంటే అది పాలకులు లేదా ఉన్నత స్థాయి నుంచే మొదలవ్వాలి. కానీ.. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే అంశంపై చర్చించే సమావేశంలోనే అతిథుల ముందు ప్లాస్టిక్ వాటర్ బాలిళ్లు ఉండడం నెటిజన్ల కంట పడింది. సమావేశానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగానే, సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు సూచించే మీరే, మీ టేబుల్స్ మీద ప్లాస్టిక్ బాటిళ్లను ఎలా ఉంచుతారు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో.. ముఖ్యంగా సీఎం పాల్గొనే సమావేశాల్లో స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడటం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచిస్తున్నారు.పర్యావరణ హితం కోసం చేసే ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మొత్తం ఆశయాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి సవాల్
హైదరాబాద్ వంటి మెట్రో పాలిటన్ నగరంలో ప్లాస్టిక్ నిషేధం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి ప్రజల మద్దతు చాలా అవసరం. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ప్రభుత్వ సీరియస్ నెస్ ను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కేవలం ప్రకటనలు ఇవ్వడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో అది అమలుకావాలంటే ప్రభుత్వం తన పనితీరులో కూడా మార్పు చూపాల్సిన అవసరం ఉంది.
మార్పు మొదలవ్వాల్సింది ఇక్కడే..
ప్లాస్టిక్ కాలుష్యం అనేది భవిష్యత్ తరాలకు పెనుముప్పు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమే అయినప్పటికీ ఆచరణలో చిన్న పొరపాట్లు విమర్శలకు తావిస్తున్నాయి. ఇకపై రాబోయే మార్గదర్శకాల్లో కేవలం ప్రజలకే కాకుండా.. ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కఠిన నియమాలు ఉంటాయని ఆశిద్దాం..
ప్రజలకు సందేశం ఇచ్చే ముందు పాలకులు ఆదర్శంగా నిలిస్తేనే.. ‘క్లీన్ హైదరాబాద్’ కల నిజమవుతుంది.
