Begin typing your search above and press return to search.

రేవంత్ మాట.. ‘పార్లమెంటులో ఏ బిల్లు మీద ఓటింగ్‌ జరిగినా తలుపులు మూస్తారు’

విషయాన్ని తమకు తోచినట్లుగా చెప్పటం చాలామంది చేసేదే. కాస్తంత తెలివైనోళ్లు అయితే.. ఈ విషయంలో మరింత తెలివితో వ్యవహరిస్తూ.. తప్పును ఒప్పును చేసే ప్రయాస పడుతుంటారు.

By:  Garuda Media   |   19 April 2026 1:45 PM IST
రేవంత్ మాట.. ‘పార్లమెంటులో ఏ బిల్లు మీద ఓటింగ్‌ జరిగినా తలుపులు మూస్తారు’
X

విషయాన్ని తమకు తోచినట్లుగా చెప్పటం చాలామంది చేసేదే. కాస్తంత తెలివైనోళ్లు అయితే.. ఈ విషయంలో మరింత తెలివితో వ్యవహరిస్తూ.. తప్పును ఒప్పును చేసే ప్రయాస పడుతుంటారు.అయితే.. నిజం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని వారు మర్చిపోతారు. నిజాన్ని నిజంలా ఒప్పుకోవటానికి ఇబ్బంది ఎందుకు? నిజాన్ని చెప్పకున్నా ఫర్లేదు.. జరిగిన తప్పును నిజంగా చిత్రీకరిస్తూ.. వాస్తవాన్ని మరుగన పడేయటం చాలా పెద్ద తప్పే అవుతుంది. తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అలాంటి తీరునే ప్రదర్శిచారని చెప్పాలి.

మహిళా బిల్లుతో పాటు.. రాజ్యాంగలోని 131వ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలు నిజమా? అబద్ధమా? అన్నది మరో చర్చ. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తేజస్వి మాటల్ని ప్రస్తావిస్తూ.. ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

పార్లమెంటులో ఏ బిల్లు మీద ఓటింగ్‌ జరిగినా తలుపులు మూస్తారని.. ఆ విషయం తేజస్వీకి తెలియదేమో అంటూ ఒకపెద్ద పాయింట్ చెప్పినట్లుగా రేవంత్ చేసిన వ్యాఖ్యల మీద మాత్రం చర్చ జరగాల్సిందే. ఎందుకంటే.. నిజాన్ని అబద్దంతో కప్పేయాలని చూడటం తప్పే అవుతుంది. ఈ తీరును ప్రదర్శించిన వారు ఎవరైనా సరే..వారి తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది.

నిజమే..సీఎం రేవంత్ చెప్పినట్లు లోక్ సభలో ఏదైనా బిల్లుపై చర్చ జరిగి.. ఓటింగ్ జరిగే సమయంలో తలుపులు మూస్తారు. అలా అని తలుపులు మూసే తీరును తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు (ఏపీ పునర్విభజన బిల్లు)వేళ జరిగిన ఘటనలతో మాత్రం పోల్చటం చరిత్రను తప్పుగా చెప్పటమే కాదు.. వాస్తవాల్ని వక్రీకరించటమే అవుతుంది. రాష్ట్ర విభజన జరిగి దగ్గర దగ్గర 12 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. ఇప్పటితరానికి అప్పట్లో ఏం జరిగిందన్న దానిపై అవగాహన తక్కువ అవుతుంది. అదే సమయంలో మెమరీ తక్కువగా ఉండేవారు.. సీఎం రేవంత్ చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా భావిస్తే తప్పులో కాలేసినట్లే అవుతుంది.

ముందుగా లోక్ సభలో ఏదైనా బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు.. ఓటింగ్ వేళలో తలుపులు మూస్తారు? అన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజం. ప్రొసీజర్ ప్రకారం చూస్తే..

- సాధారణంగా బిల్లులను 'మౌఖిక ఓటింగ్' ద్వారా ఆమోదిస్తారు. కానీ, ఎవరైనా సభ్యులు ఈ పద్ధతిని వ్యతిరేకించి ఓట్లను రికార్డ్ చేయాలని కోరినప్పుడు (డివిజన్ అడిగినప్పుడు) మాత్రం స్పీకర్ పార్లమెంటు అంతటా డివిజన్ బెల్లును మూడున్నర నిమిషాల పాటు మోగేలా చేస్తారు.

- ఆ సమయంలో ఎంపీలు ఎక్కడ ఉన్నా సభా ఛాంబర్ లోకి చేరుకోవాల్సి ఉంటుంది. బెల్ మోగడం ఆగిపోయిన వెంటనే, సభలోని అన్ని తలుపులను మూసివేస్తారు. ఆ తర్వాత ఎవరూ లోపలికి రావడానికి కానీ, బయటకు వెళ్లడానికి కానీ అనుమతి ఉండదు.

- తలుపులు మూసిన తర్వాతే ఎంపీలు తమ సీట్లలో ఉన్న 'ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్' పరికరం ద్వారా అనుకూలంగా, వ్యతిరేకంగా, ఈ రెండింటికి సంబంధం లేకుండా తటస్థంగా ఓటు వేసే వీలుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశ పెట్టిన ఏపీ పునర్విభజన బిల్లుపై ఓటింగ్ జరిగే వేళలో.. నాటి లోక్ సభలో ఏం జరిగింది? అన్నది చూస్తే.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇంతకూ ఆ బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు ఏం జరిగిందన్నది చూస్తే..

- 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందే వేళలో చోటు చేసుకున్న పరిస్థితులు సాధారణం.. అత్యంత అరుదైనవిగా చెప్పాలి. సాధారణంగా తలుపులు మూసి వేయటం అనేది ఓటింగ్ నమోదు కోసం చేసే ప్రక్రియ. కానీ.. ఆ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా పేర్కొనే విధంగా.. టీవీలో లైవ్ చర్చను నిలిపేసి.. ఓటింగ్ జరుగుతున్న సమయంలో లోక్ సభలో టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయటం లాంటి పరిణామాలుచోటు చేసుకున్నాయి.

- ఒక విధంగా చెప్పాలంటే భారత పార్లమెంట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటిగా చెప్పాల్సిందే. ఆ తర్వాత అధికారులు సాంకేతిక లోపంగా చెప్పినా..విపక్షాలు మాత్రం నాటి అధికారపక్షం పక్కా వ్యూహంతో చేసిన బ్లాక్ అవుట్ అన్నది తెలిసిందే. ఆ సమయంలో గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులను.. మీడియాను సైతం నియంత్రించటాన్ని మర్చిపోలేం. అంతేకాదు.. మైకులు విరగ్గొట్టం.. దాడులకు ప్రయత్నాలు జరగటం లాంటివి జరిగాయి. తీవ్ర ఉద్రిక్థతల మద్య విడివిడిగా రికార్డు చేసే డివిజన్ పద్దతిని పాటించకకుండా..కేవలం మౌఖిక ఓటింగ్ ద్వారానేబిల్లును ఆమోదించిన వైనాన్ని మర్చిపోకూడదు.

వాస్తవం ఇలా ఉంటే.. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ మాటలు ఉన్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరైనదా? కాదా? అన్నది ఇక్కడ చర్చ కానే కాదు. సీఎం రేవంత్ చెప్పినట్లుగా ప్రతి బిల్లు ఓటింగ్ వేళ లోక్ సభ లో అనుసరించే విధానాన్నే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఓటింగ జరిగినప్పుడుకూడా పాటించారన్నది అస్సలు నిజం కాదన్నది మర్చిపోకూడదు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఏపీకి చెందిన ఏ ఒక్క రాజకీయ నేత కూడా మాట్లాడకపోవటం.. పెదవి విప్పకపోవటం చూస్తే.. ఏపీ రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధుల వ్యవహార శైలే భిన్నమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.