సుప్రీం సంచలన నిర్ణయం... సీఎం రేవంత్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్
గత పదకొండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఉత్కంఠకు గురిచేస్తున్న 'ఓటుకు నోటు కేసు మళ్లీ మొదటికి వచ్చింది.
By: Tupaki Political Desk | 14 Aug 2026 11:43 AM ISTగత పదకొండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఉత్కంఠకు గురిచేస్తున్న 'ఓటుకు నోటు కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును తొలి నుంచి విచారించాలని సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ చేపట్టింది. ఈ సమయంలో నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
కేసుపై సుదీర్ఘంగా వాదనలు వినిపించాల్సివున్నందున వాయిదా వేయాలని కోరారు. ఇదే సమయంలో గత విచారణలో వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్యోగ విరమణ చేయడంతో తాము కూడా తొలి నుంచి వాదనలు వినాల్సివుందని ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయవాదులు కూడా ఇందుకు సిద్ధమవడంతో కేసును మళ్లీ మొదటి నుంచి విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక సుప్రీం తాజా నిర్ణయంతో ఓటుకు నోటు కేసు మరోమారు హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లలో కేసు ప్రమాణికతనే ప్రశ్నించడంతో సుప్రీం కోర్టు నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు.
కేసులో గతంలో జరిగిన విచారణను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెబుతున్నారు. గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేయడం, తదనంతర న్యాయ ప్రక్రియలో సాంకేతికపరమైన అడ్డంకులతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, ఇప్పటివరకు జరిగిన వాదనలను పక్కనపెట్టి, కేసును మొదటి నుండి కొత్తగా విచారణ చేపట్టాలని సుప్రీం నిర్ణయించడంతో కేసు భవిష్యత్తుపై ఉత్కంఠ రేగుతోంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో కేసు విచారణార్హతను ప్రశ్నించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. అవినీతి నిరోధక చట్టం - 1988 పరిధిలో ఈ వ్యవహారం వస్తుందా? లేదా? అనేదే ముందుగా తేల్చాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణ కిందకు రాదని, కాబట్టి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11 ఈ కేసులో వర్తించవని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. మరోవైపు, 2018లో జరిగిన చట్ట సవరణలు పాత కేసులకు వర్తించవని, అప్పటి చట్టాల ప్రకారం ఈ కేసు నిలబడదనే వాదనలతో చట్టపరమైన లోపాలను ఎత్తిచూపుతూ కేసును కొట్టివేయాలని కోరుతున్నారు.
ఇక న్యాయ ప్రక్రియలో జాప్యం జరగడం వల్ల ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాల్లో మరికొంత కాలం హాట్ టాపిక్ గా కొనసాగనుందని అంటున్నారు. సెప్టెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందనేది ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు, ఈ కేసులోని చట్టపరమైన చిక్కుముడులను కోర్టు ఎలా పరిష్కరిస్తుందనేది కూడా చూడాల్సివుందని అంటున్నారు. ఏది ఏమైనా, ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటికి రావడం, తెలుగు రాజకీయాల్లో పాత గాయాలను మరోసారి కెలికినట్లయింది.
