Begin typing your search above and press return to search.

టీ-హబ్ విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టమైన నిర్ణయం..

ఈ ఆదేశాలతో టీ–హబ్‌ను ప్రభుత్వ భవనంగా మార్చే యోచనపై అధికారులు పూర్తిగా వెనక్కి తగ్గినట్లు సమాచారం. భవిష్యత్తులోనూ టీ–హబ్ తన అసలు పాత్రను కొనసాగిస్తుందని స్పష్టత వచ్చింది.

By:  Tupaki Political Desk   |   24 Jan 2026 3:03 PM IST
టీ-హబ్ విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టమైన నిర్ణయం..
X

స్టార్టప్‌లకు అంకితమైన టీ–హబ్ (T-Hub) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. టీ–హబ్‌ను ప్రభుత్వ కార్యాలయంగా మార్చే ఆలోచనకు ఆయన స్పష్టంగా ‘నో’ చెప్పారు. ఈ విషయంలో ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు తక్షణమే స్పందించి, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బేగంపేట డివిజన్ రెవెన్యూ కార్యాలయాన్ని గచ్చిబౌలిలోని టీ–హబ్ భవనానికి తరలించాలన్న ప్రతిపాదన ఉందన్న వార్తలు వెలువడ్డాయి. స్టార్టప్‌ల కోసం నిర్మించిన, ఇన్నోవేషన్‌కు ప్రతీకగా నిలిచిన భవనాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అమయ్యాయి. వ్యవస్థాపకులు, ఐటీ వర్గాలు ఈ నిర్ణయం స్టార్టప్‌ల ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.

అమెరికా పర్యటనలో నుంచి స్పందించిన సీఎం..!

ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మాత్రమే తరలించాలని స్పష్టంగా సూచించారు. టీ–హబ్ పూర్తిగా స్టార్టప్‌ల కోసమే ఉండాలి అని తేల్చిచెప్పారు. టీ–హబ్‌ను ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం వల్ల ఆ భవనం లక్ష్యం దారి తప్పుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లకు ఇన్క్యుబేషన్, మెంటార్షిప్, ఇన్వెస్టర్లతో కనెక్టివిటీ వంటి కీలక అంశాలకు టీ–హబ్ కేంద్ర బిందువుగా ఉందని గుర్తు చేశారు. అందుకే అక్కడ ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

వెనక్కి తగ్గినట్లు సమాచారం..

ఈ ఆదేశాలతో టీ–హబ్‌ను ప్రభుత్వ భవనంగా మార్చే యోచనపై అధికారులు పూర్తిగా వెనక్కి తగ్గినట్లు సమాచారం. భవిష్యత్తులోనూ టీ–హబ్ తన అసలు పాత్రను కొనసాగిస్తుందని స్పష్టత వచ్చింది. ఇది తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్న గుర్తింపునకు టీ–హబ్ కీలక కారణం. ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్‌గా ఎదగాలన్న లక్ష్యానికి ఇటువంటి మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం తాజా నిర్ణయం ఆ దిశగా తీసుకున్న బలమైన అడుగుగా స్టార్టప్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. మొత్తంగా, టీ–హబ్ అంటే ప్రభుత్వ కార్యాలయం కాదు – అది స్టార్టప్‌లకు శ్వాసనాళం అన్న సందేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా పంపించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.