మూసీ ఆగ్రహం... రేవంత్ చెప్పింది సత్యం
ఈ నేపథ్యంలో తాజాగా మూసీ ఉగ్ర రూపం చూపించింది. ఏకంగా నగరాన్నే కమ్ముకునేలా ఆ భీకర స్వరూపం ఉంది.
By: Satya P | 28 Sept 2025 9:13 AM ISTముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి గత పాలకులకు భిన్నంగా చాలా కీలకమైన సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నగరంలో దురాక్రమణలకు చెక్ పెట్టేలా హైడ్రాను రంగంలోకి దింపారు. చినుకు పడితే నగరం చిన్న సైజు నదిగా మరుతోంది. దానికి కారణం కాలువలు అన్నీ పూడ్చేయడం గొలుసుకట్టు చెరువులు కూడా లేకుండా ఆక్రమించడం. ఈ రకమైన కబ్జాలతో నిండిపోయిన నగరానికి కొత్త రూపు తీసుకుని రావడానికి ఆయన హైడ్రాను ఎంచుకున్నారు. దీని వల్ల చాలా మందికి కష్టం నష్టం కలిగినా చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళారు. ఇక ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ లోగానే దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. దాంతో హైడ్రా జోరు అయితే కొంత తగ్గింది అన్నది ఉంది.
మూసీ మీద ఫోకస్ :
అదే సమయంలో రేవంత్ చేపట్టాలనుకున్న మరో ప్రాజెక్ట్ మూసీ నది ప్రక్షాళన. ఈ నదీ పరీవాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణలతో నిండిపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని ముందే ఊహించి ఆయన మూసీ నదీ పునరుజ్జీవన పనుల పేరుతో భారీ ప్రాజెక్ట్ ని చేపట్టాలని అనుకున్నారు అయితే దాని మీద విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి, కాదని అడ్డు చెప్పాయి. కూడదని కూడా గట్టిగానే భీష్మించుకుని కూర్చున్నాయి. దాంతో అది కాస్తా రాజకీయ వివాదంగా మారింది.
మూసీ ఉగ్ర రూపం :
ఈ నేపథ్యంలో తాజాగా మూసీ ఉగ్ర రూపం చూపించింది. ఏకంగా నగరాన్నే కమ్ముకునేలా ఆ భీకర స్వరూపం ఉంది. ఈ దెబ్బకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మూసీకే ధర్మాగ్రహం వస్తే ఎలా ఉంటుందో ఈ తరం కళ్లారా చూసింది ఎపుడో మూడు దశాబ్దాల క్రితం ఇంతటి పెను ఉత్పాతం వచ్చిందని పాత తరం వారు చెప్పేవారు. ఇపుడు అది వర్తమాన సమాజానికి అనుభవం లోకి వచ్చింది. ఇంత భయంకరంగా ఉంటుందా సన్నివేశం అని కూడా అంతా అనుకోవాల్సి వచ్చింది. ఈ దెబ్బకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాల వాసులే కాకుండా నగర వాసులు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ప్రాణాలు అర చేతులలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది.
భారీ వర్షం వస్తే మునకే :
మూసీ నది ఇక దురాక్రమణలు తట్టుకోలేని స్థితికి చేరుకుంది. భారీ వర్షాలు కురిస్తే పొంగి పొర్లుతాను అని గట్టి హెచ్చరికలనే జారీ చేస్తోంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి మూసీ నదీ పరివాహ ప్రాంతాలలోని కాలనీలు అన్నీ నీట మునిగాయి. అంతే కాదు ఏకంగా భాయ్గనగరమే అతలాకుతలం అయింది. ప్రధానమైన రోడ్లు అన్నీ కూడా నీటిలోనే ఉండిపోయాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అయితే నదీ ప్రవాహంతో నిండిపోయింది. అదే విధంగా మూసారాం వంతెన, చాదర్ ఘాట్ వంతెనల మీద నుంచి ఆరేడు అడుగుల పైన మూసీ నదీ వరద నీరు ప్రవహించింది. దీంతో బహు ప్రమాదకరమైన పరిస్థితుల్లో నగరం వెళ్తోంది అన్నది అందరికీ అర్ధం అయింది అంటున్నారు.
రేవంత్ కరెక్ట్ :
ఇపుడు అంతా రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అన్న ఆలోచనలకు వస్తున్నారు. ఆయన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేస్తామంటే కాదు అన్న వారు రాజకీయం చేస్తున్నారు అన్నది కూడా సగటు ప్రజలకు అర్ధం అయింది. ఇక చూస్తే రాబోయే కాలమంతా భారీ అతి భారీ వర్షాలు వచ్చేదే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అధిక ఉష్ణోగ్రతలు ఎపుడైతే నమోదు అవుతాయో ఆ వెంటనే భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ప్రకృతి చిత్రం పూర్తిగా మారుతున్న వేళ రాగల దశాబ్దాలలో ఎదురయ్యే ముప్పుని ముందే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ నది ప్రక్షాళనకు నడుం బిగిస్తుంది అని అంటున్నారు. ఈసారి ప్రజల నుంచి మద్దతు దండీగా లభిస్తుంది అని ఆశిస్తున్నారు.
