Begin typing your search above and press return to search.

మోడీ ప్రధానిగా ఉండాల్సిందే...రేవంత్ సంచలన కామెంట్స్

అదేంటి ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు.

By:  Satya P   |   6 Aug 2025 10:00 PM IST
మోడీ ప్రధానిగా ఉండాల్సిందే...రేవంత్ సంచలన కామెంట్స్
X

అదేంటి ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు. నిజమే కదా. మామూలుగా చూస్తే ఇది సంచలనమే. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. మాటల మాంత్రికుడు. ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని వెనక లాజిక్కూ మ్యాజిక్కూ చాలానే ఉంటుంది కదా. అందుకే మోడీజీ మీరు గద్దే దిగొద్దు మీరే కొనసాగండి అంటే బీజేపీ వారు ఎవరూ అసలు మురిసిపోవడానికి అవకాశం అయితే లేదు. రేవంత్ ఈ మాట ఎందుకు అన్నారంటే

వాజ్ పేయ్ ఆర్ఎస్ఎస్ :

మోడీని 2000 దశకం తొలినాళ్ళలో గుజరాత్ సీఎం గద్దే మీద నుంచి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ దించలేకపోయారు అని రేవంత్ గుర్తు చేశారు. మోడీని దించాలనుకున్నా అది ఆయన చేయలేకపోయారు అన్నారు. ఇన్నేళ్ళ తరువాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆ ప్రయత్నం చేసినా కూడా అది కూడా సాధ్యపడేది కాదని అంటున్నారు. తాజాగా మోహన్ భగవత్ 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు. మోడీకి సెప్టెంబర్ 17తో 75 ఏళ్ళు నిండుతున్న నేపధ్యంలో ఆ మాటలు అన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా సరే మోడీ ఆ మాటలు పట్టించుకోవడం లేదని అన్నారు.

అప్పటిదాక అలాగే నట :

దీంతో రేవంత్ రెడ్డి మోడీకి నేరుగా ఒక ప్రతిపాదన చేశారు మోడీ 2029 ఎన్నికల దాకా ప్రధానిగా కొనసాగాలని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కచ్చితంగా మోడీని గద్దె దించుతారని అన్నారు. వాజ్ పేయ్ చేయలేని పనిని, అలాగే ఆర్ ఎస్ ఎస్ అనుకున్న దానిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి పక్కా గ్యారంటీగా చెబుతున్నారు. అంతే కాదు మోడీ నాయకత్వంలో 2029 ఎన్నికల్లో బీజేపీ పోటీ పడినా 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా అదనంగా రాదని ఇది బీజేపీ వారు తమ డైరీలో రాసి పెట్టుకోవాలని అన్నారు.

మోడీతోనే పోరు :

దేశంలో ఓబీసీలకు నాయకత్వం వహిస్తూ వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉందని, అలాగే రాహుల్ గాంధీ ఓబీసీలకు న్యాయం చేసేందుకు ఒక గట్టి సంకల్పం తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే యాంటీ బీసీ విధానంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణాలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిస్తే అది రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉందని అలా బీసీ బిల్లులను తొక్కిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడుగులకు అండంగా కాంగ్రెస్ :

ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ సహా బడుగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ పోరాటం ఆగదని అన్నారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారి కోసం ఆలోచన చేస్తోంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన అంటున్నారు. మొత్తం మీద తమ పోరాటం ఇక మీదట నరేంద్ర మోడీతోనే అని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన బీసీల ధర్నాలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోడీని గద్దె దించి 2029లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని వచ్చి బీసీల రిజర్వేషన్లు తామే సాధించుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.