మెస్సీతో మనవడి వివాదం: సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన స్పందన
అయితే ఈ ఈవెంట్ అనంతరం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వివాదం చెలరేగింది.
By: A.N.Kumar | 19 Dec 2025 1:03 PM ISTగతంలో కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఓ ఘాటు మాట అన్నారు. అసలు కేసీఆర్ మనవడు ‘హిమాన్షు’ ఎవరండీ.. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో కేసీఆర్ తో పాల్గొనడానికి అర్హత ఏంటి అంటూ నిలదీశారు. ఇదసలే సోషల్ మీడియా కాలం.. ఆ వీడియో భద్రంగానే ఉంది. ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ రాగానే తన మనవడితో కలిసి మెస్సీతో రేవంత్ రెడ్డి చేసిన సందడి అంతా ఇంతాకాదు.. ఇక్కడే బీఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా పట్టుకొని రేవంత్ రెడ్డి నాటి మాటలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది.
ఒకవైపు హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ పాల్గొన్న కార్యక్రమం అత్యంత సవ్యంగా.. శాంతియుతంగా నిర్వహించబడినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటుండగానే.. మరోవైపు ఇలా మనవడిని మెస్సీ తో కలిపించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీవీఐపీలు, ముఖ్యమంత్రి స్వయంగా హాజరైనప్పటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం సాగడం అధికార యంత్రాంగం సమర్థతను చాటింది.
అయితే ఈ ఈవెంట్ అనంతరం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వివాదం చెలరేగింది. కొందరు నెటిజన్లు ‘అధికారాన్ని దుర్వినియోగం చేసి మనవడికి మాత్రమే అవకాశం కల్పించారు. మిగతా పిల్లలకు అవకాశం ఇవ్వలేదు’ అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ అంశంపై తొలుత స్పందించని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మాత్రం ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతోనే నా మనవడిని ఫుట్ బాల్ కార్యక్రమానికి తీసుకెళ్లాను. మేమెవరం పబ్బుల చుట్టూ తిరిగే కుటుంబం కాదు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. నేను అక్కడికి అతిథిగా మాత్రమే హాజరయ్యాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం తన అధికారాన్ని ఉపయోగించి ఫొటో అవకాశాన్ని పొందారనే విధంగా కథనాలను వండి వార్చారని.. కానీ వాస్తవంగా చూస్తే అనేకమంది పిల్లలకు మెస్సీతో ఫొటో దిగే అవకాశం లభించిందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఈ నిజం స్పష్టమైందని కూడా పేర్కొంటున్నారు.
మెస్సీతో తన మనవడి కలిసిన విమర్శలపై ఆలోచించి స్పందించాలనే ఉద్దేశంతోనే కొంత సమయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. చివరకు బలమైన మాటలతో తన వైఖరిని వెల్లడించారు. ఈ వివాదం కంటే రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చెప్పారు.
