Begin typing your search above and press return to search.

కీలక నిర్ణయాలు దిశగా రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడు పెంచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంలో ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైంది.

By:  Tupaki Political Desk   |   17 Nov 2025 5:06 PM IST
కీలక నిర్ణయాలు దిశగా రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడు పెంచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంలో ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైంది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. దీంతో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే విజయన్న ధీమాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేరు మార్చాలని డిసైడ్ అయ్యారు. తక్షణం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్న సీఎం.. ఈ విషయంలో సహచర మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం. కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలే అజెండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు గడువు తీరి చాలాకాలమే అయింది. వివిధ కారణాలతో ఈ ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల సమయంలోనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకూడదన్న నిబంధనలను పాటించాలని ధర్మాసనం స్పష్టం చేయడంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎన్నికలకు వెళ్లే వీలు లేకుండా పోయింది.

అయితే ఈ కారణంగా స్థానిక ఎన్నికలను మరింత ఆలస్యం చేయడం సరికాదన్న ఆలోచనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు నిధులు నిలిచిపోయాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు సైతం ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు వస్తేనే కానీ కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల పదవులు భర్తీ కాక క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. అందరిలో ఉత్సాహం నింపాలంటే తక్షణం ఎన్నికలు జరపాలన్నదే ప్రభుత్వ నిర్ణయంగా చెబుతున్నారు.

దీనిపై ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కోర్టు తీర్పు ప్రకారం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా? లేదా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేసేలా కృషి చేయాలా అనేది కూడా చర్చిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీపరంగా 42 శాతం మందికి సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిజాయితీని నిరూపించుకునేలా అడుగులు వేద్దామా? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికలు తక్షణం నిర్వహించాలన్న కోణంలోనే సీఎం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. జూబ్లీహిల్స్ లో సర్వం తానై పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో తమకు ఏమేర టార్గెట్ పెడతారని వారి భయానికి కారణంగా చెబుతున్నారు. లక్ష్యాలు చేరుకోని వారి పదవులకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లకు పట్టుకుందని చెబుతున్నారు.