Begin typing your search above and press return to search.

రేవంత్ దూకుడుతో రూటు మార్చిన సీనియర్ మంత్రులు!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు గురించే చర్చ జరుగుతోంది.

By:  A.N.Kumar   |   29 March 2026 9:00 PM IST
రేవంత్ దూకుడుతో రూటు మార్చిన సీనియర్ మంత్రులు!
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చివేసినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే విషయంలో ఇప్పటివరకు సందిగ్ధంలో ఉన్న సీనియర్ నేతలు, ఇప్పుడు ఆయన రాజకీయ వ్యూహప్రతిభను చూసి తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

సభలో వ్యూహాత్మక దూకుడు

శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా పేరున్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. ఆ సమయంలో మంత్రివర్గం నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిఘటన కనిపించలేదు. అయితే ఈ క్లిష్ట సమయంలో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సభను తన నియంత్రణలోకి తీసుకున్నారు.

హరీశ్ రావు వేసిన ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇస్తూనే, చర్చను బీఆర్ఎస్ వైఫల్యాల వైపు మళ్లించడంలో రేవంత్ విజయం సాధించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ప్రత్యర్థి వర్గాన్ని ఆత్మరక్షణలో పడేశారు. ఈ నిర్ణయం అటు ప్రతిపక్షానికి షాక్ ఇవ్వడమే కాకుండా సొంత పార్టీలోని సీనియర్లకు రేవంత్ మార్క్ రాజకీయమేంటో స్పష్టం చేసింది.

సీనియర్ల దృక్పథంలో మార్పు

కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ప్రకారం.. సీనియర్ నేతలు తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని, ప్రభావాన్ని కలిగి ఉంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన కంటే వయసులో అనుభవంలో పెద్దవారైన కొందరు నేతలు ఆయన నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించడానికి ఇష్టపడలేదనేది బహిరంగ రహస్యం. ఎన్నికల విజయంలో రేవంత్ కృషి ఉన్నప్పటికీ పరిపాలనలో ఆయన సామర్థ్యంపై కొందరికి సందేహాలు ఉండేవి. కానీ తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రదర్శించిన చాతుర్యం ఆ సందేహాలను పటాపంచలు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ తడబడకుండా నిర్ణయాలు తీసుకోవడం. అనుభవజ్ఞులైన ప్రత్యర్థులను కూడా తన వాగ్ధాటితో అడ్డుకోవడం... పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడం... ఈ అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ మంత్రులను ఆలోచనలో పడేశాయి. రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే కాదు, సభను నడిపించడంలోనూ ప్రత్యర్థులను చిత్తు చేయడంలోనూ మేటి అని వారు గుర్తించినట్లు సమాచారం.

పార్టీ భవిష్యత్తుపై ప్రభావం

ముఖ్యమంత్రి పట్ల సీనియర్లలో వచ్చిన ఈ మార్పు రాబోయే రోజుల్లో పార్టీకి సానుకూల అంశంగా మారనుంది. అంతర్గత విభేదాలు తగ్గుముఖం పట్టి రేవంత్ నాయకత్వంలో అంతా కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. "రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం కంటే ఆయనతో కలిసి సాగడమే శ్రేయస్కరం" అనే భావన సీనియర్లలో బలంగా నాటుకుపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశం తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడమే కాకుండా సీనియర్ల గౌరవాన్ని కూడా తన రాజకీయ చాతుర్యంతో దక్కించుకున్నారు. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై.. ప్రభుత్వ పాలనపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.