Begin typing your search above and press return to search.

ఖర్గే వద్దకు 'కొండా' .. సీన్ లోకి 'కేవీపీ'

కొండా సురేఖ కూతురు వ్యాఖ్యల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కొండా మురళి భేటీకి ప్రయత్నించగా ఆయన తిరస్కరించారని తెలుస్తోంది.

By:  Garuda Media   |   24 Aug 2026 10:37 AM IST
ఖర్గే వద్దకు కొండా .. సీన్ లోకి కేవీపీ
X

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ మలుపులు తిరుగుతుంది. వివాదం చెలరేగి ఐదు రోజులు దాటినా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న విషయం బయటకు పొక్కింది. అదే సమయంలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ గంటపాటు భేటీ అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. మరోవైపు కొండా సురేఖ తరపున కాంగ్రెస్ అధిష్ఠానంతో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు చక్రం తిప్పుతున్నారు అన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

కొండా సురేఖ వివాదం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలకు ముందే కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందన్న ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలకు భిన్నంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన, వ్యవహారశైలి నడుస్తోంది అన్న వారు ఉన్నారు. మోడీకి, బీజేపీకి అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. సెంట్రల్ మినిస్టర్ కుమారుడి మీద పోక్సో కేసు, తాజాగా ఎంపీ కుమారుడు యాక్సిడెంట్ కేసులో తెలంగాణ పోలీసుల వైఖరి జాతీయస్థాయిలో వివాదాస్పదమైంది. జాతీయ మీడియా దీనిని తీవ్రంగా తప్పుపడుతుంది. మరో వైపు సర్ కార్యక్రమంలో భాగంగా ఓట్ల నమోదు, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ వివాదం మొదలయింది. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోని మంత్రి కూతురు నేరుగా సీఎం మీద ఆరోపణలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉండడం ఆయన సంధిగ్ద పరిస్థితిని తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి తరపున దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇరువురు మంత్రులు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి, చర్యలకు డిమాండ్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అసలు అధిష్టానం ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

కొండా సురేఖ కూతురు వ్యాఖ్యల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీకి ప్రయత్నించగా ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండా సురేఖ నేరుగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. పార్టీ క్రమశిక్షణ కమిటీకి తన సమాధానం ఇచ్చిన కొండా సురేఖ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతనైన తన మీద జరుగుతున్న ప్రచారం వెనక ఎవరున్నారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇది ఇలా ఉంటే కొండా సురేఖ తరపున ఢిల్లీలో పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం ఉత్కంఠ రేపుతున్నది. వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీతో కొండా దంపతులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో అధిష్టానంతో కొన్ని పనులకు సీఎం రేవంత్ రెడ్డి కేవీపీ సహాయం తీసుకున్నారని ప్రచారం ఉంది. ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా వివాదంలో కేవీపీ చక్రం తిప్పడం ఆసక్తికర అంశం.

మరి మల్లిఖార్జున ఖర్గేతో భేటీలో కొండా సురేఖ ఏం చర్చించారు ? ఢిల్లీ లో కేవీపీ అధిష్టానంతో ఏం చక్రం తిప్పుతున్నారు ? లండన్ నుండి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై ఎలా స్పందిస్తారు ? మొత్తంగా అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది వేచిచూడాలి.