కేరళ గెలుపులో రేవంత్ వాటా ఇదే!
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యూడీఎఫ్ విజయం దక్కించుకుంది.
By: Garuda Media | 5 May 2026 10:33 AM ISTఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యూడీఎఫ్ విజయం దక్కించుకుంది. ఇక్కడి 140 అసెంబ్లీ స్థానాల్లో 102 స్థానాల్లో కూటమి గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఈ విజయంలో పలువురి పాత్ర ఉన్నప్పటికీ.. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రేవంత్ కేవలం కేరళపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
దాదాపు 18 రోజుల పాటు ఆయన ప్రచారం నిర్వహించారు. తొలి దశలో 7 రోజులు.. తర్వాత తర్వాత నాలుగు రోజుల చొప్పున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే.. ఇది సాధారణ ప్రచారమైతే.. పెద్దగా చర్చ ఉండేది కాదు. కాంగ్రెస్ తరఫున ఎంతో మంది ప్రచారం చేశారు కాబట్టి.. ఆ లెక్కలో కలిసిపోయేది. కానీ, రేవంత్ చేసిన ప్రచారం విభిన్నంగా సాగింది. ఆయన కేరళకు, తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య లింకు పెట్టి ప్రచారం సాగించారు.
తిరువనంతపురం జిల్లా సహా.. పాలక్కాడు, పథనం తిట్ట వంటి తెలుగు వారి మూలాలు ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున రోడ్ షోలు.. ప్రసంగాలతో దంచి కొట్టారు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో సీఎం పినరయి విజయన్‌ను ఢీ అంటే ఢీ అన్నట్టుగా రేవంత్ ఢీ కొట్టారు. ఆయనకు అనేక సవాళ్లు విసిరారు. పేద రికం నుంచి అవినీతి వరకు , నిరుద్యోగం నుంచి ఉపాధి కల్పన దాకా.. అనేక అంశాలను రేవంత్ ప్రస్తావించా రు. ఈ క్రమంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య లేఖల యుద్ధం కూడా కొనసాగింది.
ఇది కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలసి వచ్చింది. రేవంత్ ప్రసంగాలను.. ముఖ్యంగా సీఎం పినరయి విజయన్ చేసిన ప్రసంగాలతో పోల్చుతూ.. స్థానికంగా బలంగా వినిపించారు. `రైజింగ్ తెలంగాణ` మాదిరి గా `రైజింగ్ కేరళ` మంత్రాన్ని జపించారు. నగరాలు, పట్టణాల్లో రేవంత్ ఫొటోలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆయన ప్రసంగాలను స్థానిక భాషలోకి అనువదించి.. మరింత విస్తారంగా ప్రచారంలోకి తెచ్చారు. మొత్తంగా కేరళ విజయంలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు.. బాగానే పనిచేశాయి.
