వివాదం రేపిన రేవంత్ కర్నాటక టూర్.. విషయం ఏంటంటే!
కర్ణాటక-ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించిన ఆర్డీస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ప్రాజెక్టుకు అనుబంధంగా కర్ణాటక మరిన్ని ప్రాజెక్టులు కడుతోంది.
By: Garuda Media | 25 Jun 2026 6:14 PM ISTచాలా రోజుల తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలిశారు. తుంగభద్ర నది పై నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా గేట్లు అమర్చారు. వీటిని గురువారం సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌లు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భం గా రేవంత్ కర్ణాటక పర్యటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) అధ్యక్షు రాలు కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎందుకు?
కర్ణాటక-ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించిన ఆర్డీస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ప్రాజెక్టుకు అనుబంధంగా కర్ణాటక మరిన్ని ప్రాజెక్టులు కడుతోంది. వీటిని కూడా గురువారమే ప్రారంభించనున్నారు. అయితే.. దీనివల్ల తెలంగాణలోని పలు జిల్లాలకు నష్టం జరుగుతుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో నే కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ నీటి హక్కులను కర్ణాటక రాష్ట్రానికి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
అసలేంటి వివాదం?
తెలంగాణ, ఏపీ సాగునీటి రంగంలో ఆర్డీఎస్ కీలకం. ఇది తుంగభద్ర నదిపై నిర్మించిన ఒక ముఖ్యమైన ఆనకట్ట. ఈ ఆనకట్టను తుంగభద్ర నదిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఏపీలో కొన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఆర్డీఎస్ లో తెలంగాణకు 15.9 టిఎంసిల నీటి వాటా ఉంది.
అయితే.. ఆర్డీఎస్ ఆనకట్టకు అనుబంధంగా కర్ణాటక రాష్ట్రం మరికొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటి నిర్మాణం పూర్తయితే.. తెలంగాణకు ఆర్డీఎస్ ద్వారా రావాల్సిన నీరు రాకపోవచ్చన్నది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే.. దీనిపై కాంగ్రెస్ పార్టీ మరోవాదన చేస్తోంది. గతంలో బీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే.. చూస్తూ కూర్చున్నారని.. అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తోంది.
ఇదిలావుంటే, ఆర్డీఎస్ ఆధునికీకరణ, పూడిక తీత పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కర్ణాటక, ఏపీలను ఒప్పించి తెలంగాణకు రావాల్సిన పూర్తి వాటా నీటిని సాధించుకోవాలని ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంరేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటన పెట్టుకోవడం గమనార్హం.
