వెయ్యి.. వంద..యాభై.. పాతిక ఎకరాలు..సంచలనంగా రేవంత్ లెక్కలు
అయితే.. పదేళ్లు అధికారంలో ఉండి.. తన స్థాయికి ఏ మాత్రం తగ్గని వారితో తాను ఆట ఆడటం ఏమిటి? అన్నట్లుగా కేసీఆర్ మైండ్ సెట్ ఉన్న వేళ..సీఎం రేవంత్ సవాలుకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 8 July 2026 1:43 PM ISTసీఎం రేవంత్ వ్యాఖ్యల పదును ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులపై విరుచుకుపడే వేళలో ఆయన అరుదైన పద్దతిని ఫాలో అవుతుంటారు. సామాన్య జనాలకు ఇట్టే పట్టేసేలాంటిమాటలతో పాటు.. తాను చెప్పేవన్నీ గాలి పోగేసినట్లుగా కాకుండా.. పక్కాగా ప్రిపేర్ అయినట్లుగా గణాంకాల్ని ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాల్ని సంధిస్తుంటారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజాప్రతినిధులకు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ విసిరిన సవాలుకు పూర్తిస్థాయిలో స్పందించిన రేవంత్.. అందుకు బదులుగా విసిరిన ప్రతిసవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయని చెప్పాలి. ఉద్యమ వేళలో ఈ తరహా సవాళ్లు కేసీఆర్ ముందు పెడితే.. అనూహ్య రీతిలోస్పందించేవారు. అయితే.. పదేళ్లు అధికారంలో ఉండి.. తన స్థాయికి ఏ మాత్రం తగ్గని వారితో తాను ఆట ఆడటం ఏమిటి? అన్నట్లుగా కేసీఆర్ మైండ్ సెట్ ఉన్న వేళ..సీఎం రేవంత్ సవాలుకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రేవంత్ గొప్పదనం ఏమంటే..కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూనే.. మధ్యలో రాజకీయ విమర్శల తీవ్రత చూస్తే.. ఓవైపు సబ్జెక్టు.. మరోవైపు రాజకీయ విమర్శలతో కలిపి పర్ ఫెక్టు ప్యాకేజీ మాదిరి విరుచుకుపడిన వైనంతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులపై విరుచుకుపడిన వైనం కొత్తగా ఉంది.
కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలైనట్లుగా ఆరోపించిన రేవంత్.. ‘‘కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్.. కేటీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్.. హరీశ్ రావుకు 50 ఎకరాల ఫామ్ హౌస్.. కవితకు 25 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నాయి’’ అని చెప్పటం ద్వారా కొత్త కలకలానికి తెర తీశారని చెప్పాలి. కేసీఆర్ కుటుంబంలో భూ బ్యాంక్ ఇంత భారీగా ఉందా? అన్న ప్రశ్న ప్రజల మనసుల్లో తలెత్తేలా చేశారని చెప్పాలి. మిగిలిన రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్.. కవితకు ఉన్న భూముల లెక్కకు సంబంధించి రానున్నరోజుల్లో ముఖ్యమంత్రి మరెన్ని విషయాలు చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
